
ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి వల్ల గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం లేదా నిలబడటం సర్వసాధారణమైపోయింది. అయితే ఈ అలవాటు మీ ఆయుష్షును తగ్గించడమే కాకుండా ప్రాణాంతక గుండె జబ్బులకు దారితీస్తుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రముఖ వైద్య జర్నల్ లాన్సెట్‌లో వచ్చిన అధ్యయనం ప్రకారం.. రోజుకు కేవలం 30 నిమిషాల పాటు కూర్చునే అలవాటును తగ్గించుకుంటే, అకాల మరణం సంభవించే ప్రమాదం 10 శాతం తగ్గుతుంది. ఫిబ్రవరి 11న వెలువడిన మరో అధ్యయనం కూడా నిశ్చల జీవనశైలి వల్ల గుండె జబ్బుల ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది.
చాలామంది కూర్చోవడం కంటే నిలబడటం మంచిదని భావిస్తారు. కానీ పరిమితికి మించి నిలబడటం వల్ల కూడా సమానమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు నిలబడటం వల్ల కాళ్లలో నొప్పి, తిమ్మిర్లు, బరువుగా అనిపించడం, వాపు వస్తుంది. నిరంతరం నిలబడటం వల్ల కాళ్లలోని సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రక్తం గుండెకు తిరిగి చేరడం కష్టమవుతుంది. కాళ్ల కండరాలు కదలనప్పుడు రక్తం కింది భాగంలోనే పేరుకుపోయి చీలమండల వాపుకు, తీవ్ర అసౌకర్యానికి దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంలో వెరికోస్ వెయిన్స్ సమస్యకు కారణం కావచ్చు.
కేవలం నిలబడటమే కాకుండా.. కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాహార లోపాలు, శారీరక ఒత్తిడి వల్ల కూడా కాళ్ల నొప్పులు రావచ్చు. ఇవి నిరంతరంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
మీ శరీరాన్ని ఒకే భంగిమలో బంధించకండి. కూర్చున్నా, నిలబడినా మధ్య మధ్యలో విరామం తీసుకోవడమే మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..