
కుక్క లేదా ఇతర జంతువుల కాటును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కీలక హెచ్చరికలు జారీ చేసింది. జంతువుల ద్వారా సోకే రేబిస్ వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని.. ఒక్కసారి ఈ వ్యాధి మనకు సోకినట్టు బయటపడితే ఆ తర్వాత చికిత్స అందించడం చాలా కష్టం అని తెలిపింది. కొన్ని సార్లు ఇది మరణానికి కూడా దారి తీయొచ్చని స్పష్టం చేసింది. కాబట్టి ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఏవైనా జంతువులు కరిస్తే.. తక్షణ ప్రథమ చికిత్స, సకాలంలో వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరింది.
కుక్కలు, పిల్లులు, కోతులు, నక్కలు లేదా ముంగిసలు వంటి జంతువులు కరిచినా, గీరినా వెంటనే చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది పెద్దగా గాయం కాలేదని ఊరుకుంటారని.. కానీ అది కూడా ప్రమాదమని నిపుణులు అంటున్నారు. జంతువు మనను కరిచిన తీవ్రతను బట్టి తీసుకోవాల్సిన చికిత్సలను 3 వర్గాలుగా విభజించారు నిపుణులు.
జంతువుల కాటు తీవ్రతను బట్టి చికిత్సలు
కేటగిరీ 1: ఎప్పుడైన మీ పెంపుడు కుక్క లేదా పిల్లి వంటి జంతువులు చర్మాన్ని నాకినా లేదా ఎలాంటి గాయం కాకపోతే సబ్బు, నీటితో కడిగితే సరిపోతుంది. దీనికి మీరు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు.
కేటగిరీ 2: జంతువు గీరినప్పుడు కేవలం రక్తం రాకుండా, చర్మంపై గీతలు పడినా దాని ద్వారా వైరస్ శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి గాయాన్ని శుభ్రం చేసి, ఐదు డోసుల రేబిస్ వ్యాక్సిన్ వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
కేటగిరీ 3: ఒక వేళ మిమ్మల్ని జంతువు కచినప్పుడు తీవ్రమైన గాయాలు అంటే రక్తంశ్రావం జరిగితే రేబిస్ వ్యాక్సిన్‌తో పాటు, వైరస్‌ను తక్షణమే అడ్డుకోవడానికి గాయం చుట్టూ హ్యూమన్ రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు.
మొదటి 15 నిమిషాలు అత్యంత కీలకం
జంతువు కరిచిన వెంటనే చేసే ప్రథమ చికిత్స వైరస్ వ్యాప్తిని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గాయాన్ని ప్రవహించే నీటి కింద ఉంచి, సబ్బుతో కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు బాగా కడగాలి. సబ్బులో ఉండే ఆల్కలైన్ రేబిస్ వైరస్ బయటి పొరను దెబ్బతీసి, దాని తీవ్రతను తగ్గిస్తుంది. ఆ తర్వాత పొవిడోన్-అయోడిన్ వంటి యాంటిసెప్టిక్ లిక్విడ్ రాయాలి.
వ్యాక్సిన్ షెడ్యూల్ తప్పనిసరి
రేబిస్ వైరస్ లక్షణాలు శరీరంలో చేరిన 15 నుండి 90 రోజులలోపు ఎప్పుడైనా బయటపడవచ్చు. కొన్ని కేసుల్లో ఇందుకు కొన్ని సంవత్సరాల సమయం కూడా పట్టవచ్చు. అందుకే షెడ్యూల్ ప్రకారం మీరు వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. నిపుణుల సూచనల ప్రకారం 0, 3, 7, 14, 28 వ రోజుల్లో మొత్తం 5 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. దీంతో పాటు సెకండరీ ఇన్ఫెక్షన్లు రాకుండా టెటనస్ ఇంజెక్షన్, యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.