
ఉదయాన్నే వేడివేడి సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో క్రిస్పీగా ఉండే మినప వడలు తింటే ఆ రుచే వేరు. అయితే చాలా మంది గృహిణులు ఇంట్లో వడలు లేదా గారెలు చేసినప్పుడు అవి హోటల్‌లో లాగా గుల్లగా రావడం లేదని, గట్టిగా అవుతున్నాయని లేదా నూనె ఎక్కువగా పీల్చేస్తున్నాయని అంటుంటారు. పర్‌ఫెక్ట్ మినప వడ రావడానికి పిండి కన్సిస్టెన్సీ, రుబ్బే విధానం చాలా కీలకం. దీనికోసం కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే క్రిస్పీ వడలను సులభంగా తయారు చేసుకోవచ్చు.
మినపప్పు: 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు: 1 స్పూన్, అల్లం తరుగు: 1 స్పూన్, కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా, మిరియాలు కచ్చాపచ్చాగా దంచినవి: స్పూన్, జీలకర్ర: 1 స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: డీప్ ఫ్రైకి సరిపడా తీసుకోవాలి.
మినపప్పును శుభ్రంగా కడిగి 4-5 గంటల పాటు నానబెట్టాలి. పప్పు ఎక్కువ సమయం నానితే వడలు నూనె పీల్చే ప్రమాదం ఉంది. రుబ్బే ముందు నానబెట్టిన పప్పును కనీసం 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే పిండి రుబ్బేటప్పుడు వేడెక్కకుండా ఉంటుంది. నానిన పప్పులోని నీటిని పూర్తిగా వడకట్టి, మిక్సీ లేదా గ్రైండర్‌లో వేయాలి. రుబ్బేటప్పుడు నీటిని అస్సలు పోయకూడదు. అవసరమైతే కేవలం 1-2 స్పూన్ల ఐస్ వాటర్ చిలకరిస్తూ గట్టిగా, వెన్నలా నునుపుగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని, చేత్తో ఒకే దిశలో 4-5 నిమిషాల పాటు బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పిండిలోకి గాలి చేరి, వడలు లోపల ఎంతో సాఫ్ట్‌గా, గుల్లగా వస్తాయి. పిండిని నీళ్లలో వేస్తే అది తేలాలి, అప్పుడే పర్‌ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు.
ఇప్పుడు ఆ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు వేసి కలపాలి. చేతిని తడి చేసుకుని, కొద్దిగా పిండిని తీసుకుని మధ్యలో రంధ్రం చేసి, బాగా కాగిన నూనెలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. వడలు మరింత క్రిస్పీగా రావడం కోసం పిండి రుబ్బిన తర్వాత అందులో 1 నుండి 2 స్పూన్ల బియ్యం పిండి లేదా ఉప్మా రవ్వ కలపవచ్చు. ఇది పిండిలో ఉన్న అదనపు తేమను పీల్చుకుని వడలను కరకరలాడేలా చేస్తుంది. వేడివేడి క్రిస్పీ మినప వడలను అల్లం చట్నీ లేదా వేరుశనగ చట్నీతో వడ్డిస్తే ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు!
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..