
ఉల్లిపాయలు ప్రతి వంటగదిలో కచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఇవి త్వరగా పాడైపోతాయనే సమస్య చాలా మందికి ఉంటుంది. అయితే కొద్దిగా జాగ్రత్త పడితే ఉల్లిపాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు. కొన్ని చిట్కాలు పాటిస్తే మీ ఉల్లిపాయలు చాలా కాలం పాటు పాడవకుండా ఉంటాయి.
ఉల్లిపాయలను స్టోర్ చేసే చోట గాలి బాగా తగలడం చాలా ముఖ్యం. గాలి తగలకపోతే అవి తడిగా మారి, బూజు పడతాయి. దాంతో త్వరగా చెడిపోతాయి. గాలి బాగా తగిలే బుట్టల్లో లేదా వల సంచుల్లో ఉంచడం వల్ల ఉల్లిపాయలు తేమను తట్టుకొని తాజాగా ఉంటాయి.
ఉల్లిపాయలు తేమను అస్సలు తట్టుకోలేవు. తడిగా ఉన్న చోట పెడితే అవి కుళ్లిపోతాయి. అందుకే ఫ్రిజ్‌లో ఉల్లిపాయలను అస్సలు ఉంచకూడదు. అలాగే సూర్యకాంతి లేదా పగటి వేడి ఎక్కువగా పడే చోట్లు కూడా ఉల్లిపాయల లైఫ్ ను తగ్గిస్తాయి. చల్లని గదిలో, వెలుతురు తక్కువగా ఉండే మూలల్లో ఉంచడం మంచిది.
ఉల్లిపాయలను ఇతర కూరగాయలతో కలిపి ఉంచడం వల్ల అవి త్వరగా చెడిపోతాయి. ముఖ్యంగా బంగాళాదుంపలు లేదా యాపిల్స్ లాంటి తేమ ఉండే పదార్థాలు వాటి దగ్గర ఉంటే ఉల్లిపాయలు తడిగా మారి త్వరగా కుళ్లిపోతాయి. అంతే కాదు ఉల్లిపాయలు వాటి వాసనను కూడా పీల్చుకునే అవకాశం ఉంది. అందుకే వీటిని వేరుగా ఉంచడం మంచిది.
ఈ చిన్న చిట్కాలను పాటిస్తే.. మీరు కొన్న ఉల్లిపాయలు ఎక్కువ రోజుల పాటు వాడుకోవడానికి పనికొస్తాయి. వంటకాల రుచి బాగుండాలంటే.. తాజా ఉల్లిపాయలు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. కాబట్టి వాటిని జాగ్రత్తగా నిల్వ చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దు.