ఏసీ, కూలర్లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే సమ్మర్‌లోనూ ఇల్లు చల్లగా ఉంటుంది..

భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఏసీలు, కూలర్లు వేసినా సరే సెగలు తగ్గడం లేదా? అయితే ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాల మీద మాత్రమే ఆధారపడకుండా.. మన పూర్వీకులు పాటించిన సహజసిద్ధమైన, సంప్రదాయ పద్ధతులతో ఇంటిని ఏసీలా మార్చుకోవచ్చు. మట్టి కుండ నీళ్ల నుంచి వట్టివేళ్ల తడికల వరకు, టెర్రస్ గార్డెనింగ్ నుంచి ఆహారపు అలవాట్ల వరకు.. ఈ మూడు నెలల వేసవిని చల్లగా దాటేయడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే..

ఏసీ, కూలర్లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే సమ్మర్‌లోనూ ఇల్లు చల్లగా ఉంటుంది..
Natural Summer Cooling Tips

Updated on: Mar 22, 2026 | 6:21 PM

ఎండలు ముదురుతున్న కొద్దీ సామాన్యుడికి కరెంటు బిల్లుల భయం పట్టుకుంటుంది. 24 గంటలు ఏసీలు వేయలేక, ఉక్కపోతను భరించలేక సతమతమయ్యే వారి కోసం రమా రావి కొన్ని సహజసిద్ధమైన మార్గాలను సూచించారు. మన పూర్వీకులు పాటించిన పద్ధతులకు కొంచెం ఆధునికతను జోడిస్తే, ఈ వేసవిని సులభంగా దాటవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. సూర్యరశ్మి నేరుగా ఇంట్లోకి రాకుండా చూడటమే మొదటి సూత్రం. ఎండ తీవ్రత పెరగకముందే తలుపులు, కిటికీలు మూసివేయాలి. కిటికీ అద్దాలకు ఆనుకుని పాత న్యూస్‌పేపర్లు లేదా మందపాటి దుప్పట్లు అమర్చడం వల్ల బయటి వేడి లోపలికి రాదు. బాల్కనీలలో వట్టివేళ్ల తడికలు లేదా వెదురు కర్టెన్లు వాడటం ఉత్తమం. వట్టివేళ్ల తడికలపై నీళ్లు చల్లడం వల్ల చల్లటి గాలితో పాటు మంచి సువాసన కూడా వస్తుంది. పాత ఇళ్లలో ఉండే వెంటిలేటర్ల ద్వారా వేడి గాలి లోపలికి రాకుండా వాటిని క్లాత్‌లతో కప్పాలి.

టెర్రస్ గార్డెనింగ్.. సహజమైన ఏసీ

ఇంటి పైకప్పు వేడెక్కితే ఇల్లు సెగలు కక్కుతుంది. దీనిని నివారించడానికి రమా రావి రెండు మార్గాలు సూచించారు. టెర్రస్ పైన మరియు బయటి గోడలకు కూల్ పెయింట్ వేయడం వల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రత దాదాపు 70 శాతం వరకు తగ్గుతుంది. మేడ పైన తీగ మొక్కలు లేదా అరటి చెట్లు పెంచడం వల్ల స్లాబ్ చల్లగా ఉంటుంది. ఇది ఇంటికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, స్వచ్ఛమైన కూరగాయలను కూడా అందిస్తుంది.

గాలి ప్రసరణ ముఖ్యం

ఇంట్లో పేరుకుపోయిన వేడి గాలిని బయటకు పంపడానికి కిచెన్, బాత్‌రూమ్, హాల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లను ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో బయట గాలి చల్లబడినప్పుడు కిటికీలు తెరిచి క్రాస్ వెంటిలేషన్ జరిగేలా చూడాలి. ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం వల్ల సహజంగానే వాతావరణం చల్లబడుతుంది.

ఆహారపు అలవాట్లలో మార్పులు

శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడానికి కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలను నిపుణులు సూచించారు.

కుండ నీరు: ఫ్రిజ్ నీళ్లకు బదులుగా మట్టి కుండలో నీటిని తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు చల్లదనం లభిస్తుంది.

చలువ చేసేవి: మజ్జిగ, బియ్యం కడిగిన నీరు, తాటి ముంజెలు, సబ్జా గింజలు, సగ్గుబియ్యం జావ వంటివి రోజూ తీసుకోవాలి.

దుస్తులు: ఎండ ప్రభావం తగ్గాలంటే తెలుపు లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. ఐస్‌క్రీమ్‌లు శరీరంలో వేడిని పెంచే అవకాశం ఉన్నందున వాటిని పరిమితం చేయాలి.

ఈ మూడు నెలల వేసవిని అధిగమించడానికి ఖరీదైన యంత్రాలు అక్కర్లేదు, చిన్నపాటి చైతన్యం ఉంటే చాలు” అని నిపుణులు చెబుుతన్నారు. పాతకాలపు విసనకర్రలు, సంప్రదాయ పద్ధతులు పాటిస్తే పర్యావరణానికి మేలు చేయడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

Follow Us