బియ్యం పిండితో ఫేస్‌ప్యాక్.. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 1 చెంచా బియ్యం పిండి, 2 చెంచాలు బొప్పాయి గుజ్జు, 2 కుంకుమపువ్వు, 1 చెంచా పాలు అవసరం. ముందుగా కుంకుమపువ్వును పాలలో నానబెట్టి, బొప్పాయి గుజ్జు, బియ్యం పిండిని కలిపి పేస్టులా తయారుచేయాలి. దీనిని ముఖానికి, మెడకు అప్లై చేసి 20-30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది. బియ్యం పిండిలోని ఫైటిక్ యాసిడ్, ఫెరులిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. కుంకుమపువ్వులోని యాంటీఆక్సిడెంట్లు సహజ మెరుపునిస్తాయి. బొప్పాయి గుజ్జులోని పపైన్ ఎంజైమ్ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
అలోవెరా ఫేస్‌ప్యాక్.. అలోవెరా, దోసకాయ, బంగాళాదుంపతో తయారుచేసే ఫేస్‌ప్యాక్ కోసం 1 టేబుల్ స్పూన్ దోసకాయ రసం, 1 టేబుల్ స్పూన్ బంగాళాదుంప రసం, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకొని బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. అలోవెరా చర్మాన్ని తేమగా ఉంచి మెరుపు అందిస్తుంది. దోసకాయ చర్మాన్ని హైడ్రేట్ చేసి మంటను తగ్గిస్తుంది. బంగాళాదుంప రసం సహజ బ్లీచింగ్ గుణాలు కలిగి ఉండటంతో చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.
వేప ఫేస్‌ప్యాక్.. వేప , తులసి, మందార పొడి కలిపి తయారు చేసే ఫేస్‌ప్యాక్ కోసం వేప పొడి 1 చెంచా, తులసి పొడి 1 చెంచా, మందార పూల పొడి 1 చెంచా తీసుకొని కొద్దిగా నీటితో పేస్టుగా తయారుచేసి ముఖానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. వేప పొడి చర్మంలోని మురికిని తొలగించి టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. తులసి చర్మాన్ని తాజాగా, మృదువుగా మారుస్తుంది. మందార పొడిలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
గంధం ఫేస్‌ప్యాక్.. గంధం, టమాట రసం కలిపి తయారుచేసే ఫేస్‌ప్యాక్ కోసం 1 చెంచా గంధం పొడి, 1 చెంచా టమాట రసం, 1 చెంచా రోజ్ వాటర్ కలిపి పేస్టుగా చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తే చర్మం మరింత మెరుగవుతుంది. గంధం చర్మంపై మచ్చలను తగ్గిస్తుంది. టమాట రసంలోని విటమిన్లు సహజ మెరుపునిస్తాయి. రోజ్ వాటర్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
పసుపు ఫేస్‌ప్యాక్.. పసుపు, తేనె, నిమ్మరసం కలిపి తయారుచేసే ఫేస్‌ప్యాక్ కోసం 1 చెంచా పసుపు పేస్ట్, 2 చెంచాలు తేనె, 1 చెంచా నిమ్మరసం తీసుకొని మెత్తగా పేస్టుగా తయారుచేసి ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. పసుపులోని కర్కుమిన్ హైపర్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. తేనె చర్మాన్ని తేమగా ఉంచి ఆరోగ్యంగా మారుస్తుంది. నిమ్మరసం చర్మాన్ని క్రమంగా బిగుస్తూ, చర్మరంద్రాలను తగ్గిస్తుంది.
ఫేస్‌ప్యాక్స్‌ని వాడటంతో పాటు రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. హెల్తీ డైట్‌ను పాటించడం ముఖ్యం. ఎండకు ఎక్కువగా వెళ్లే ముందు సన్‌స్క్రీన్ వాడాలి. కెమికల్ ప్రోడక్ట్స్ వినియోగాన్ని తగ్గించాలి. ఈ సూచనలు పాటిస్తే సహజంగా ఆరోగ్యమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
(ఈ ఫేస్‌ప్యాక్స్ ఉపయోగించే ముందు చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి. చర్మం భిన్నంగా స్పందించే అవకాశం ఉండటంతో ఏదైనా అలర్జీ లేదా సమస్యలు తలెత్తితే నిపుణుల సలహా తీసుకోవాలి)