పుచ్చకాయలు వేసవి కాలంలో దాహాన్ని తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆరోగ్య సమస్యలకు దివ్యమైన ఔషదంలా పనిచేస్తాయి. అలాంటి వీటికంటూ ఒక స్పెషల్ డే ఉంది. ప్రతి సంవత్సరం ఆగష్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవంగా జరుపుకుంటారు. స్పెషల్ గా అమెరికాలో ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈ స్పెషల్ డేని ఎవరు కనిపెట్టారో ఇప్పటికీ తెలియదు. కొందరు దీనిని పుచ్చకాయ రైతులు ప్రారంభించారని, మరికొందరు నేషనల్ వాటర్ మెలన్ కౌన్సిల్ సృష్టించినట్లు చెబుతారు. దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఈ పంటను పండించేవారు. దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి పుచ్చకాయ పంట ఆసియా అంతటా వ్యాపించింది.
పుచ్చకాయలలో వ్యాధినిరోధక శక్తిని పెంచే బీటా కెరొటిన్, విటమిన్ బి, సి, లతో పాటు శరీర పనితీరుకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాసియం, అయోడిన్‌లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు వీటి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజల్ని పొడి కొట్టి ఆ పొడిని నీటిలో మరిగించి చల్లారాక తాగితే కిడ్నీలో రాళ్లు మటుమాయం అవుతాయని అంటారు. ఇక పుచ్చకాయ అడుగున ఉండే తెల్లనైన పదార్ధం చర్మానికి చాలా మేలు చేస్తుంది. దాంతో చర్మాన్ని రుద్దితే చెమట వల్ల ఏర్పడే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.