ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా..?

Morning Vs Evening Exercise: ఎక్సర్‌సైజ్ చేయడానికి సరైన సమయం ఏది..? కొత్త పరిశోధనలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం వ్యాయామం కొవ్వును త్వరగా కరిగిస్తుందని, సాయంత్రం వ్యాయామం కార్బోహైడ్రేట్‌లను ఉపయోగిస్తుందని పరిశోధన వెల్లడించింది. ఫలితాలు భిన్నంగా ఉన్నప్పటికీ.. క్యాలరీల విషయం ఒకే విధంగా ఉంటుందని అధ్యయనం సూచిస్తుంది.

ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా..?
Morning Vs Evening Exercise

Updated on: Dec 25, 2025 | 6:58 AM

ఫిట్‌నెస్ ఔత్సాహికులలో ఎప్పటి నుంచో ఉన్న అతిపెద్ద గందరగోళం ఏమిటంటే.. వ్యాయామం చేయడానికి ఉదయం సరైన సమయమా లేక సాయంత్రమా అని. ఈ దీర్ఘకాలిక చర్చకు సమాధానం ఇస్తూ ఇటీవల ఒక ఆసక్తికరమైన అధ్యయనం వెలువడింది. వ్యాయామం చేసే సమయాన్ని బట్టి మన శరీరం శక్తిని ఎలా వాడుకుంటుందో ఈ పరిశోధన స్పష్టంగా వివరించింది. ఈ పరిశోధన కోసం కాలేజీ చదివే 18 మంది యువకులను ఎంపిక చేశారు. వీరు ప్రతిరోజూ వేర్వేరు సమయాల్లో 50 నిమిషాల పాటు పరిగెత్తారు. ముఖ్యంగా అల్పాహారానికి ముందు, రాత్రి భోజనానికి ముందు వర్కౌట్స్ చేయించారు. వారు చేసిన వ్యాయామాల నుంచి డేటాను సేకరించి ఈ నివేదికను రూపొందించారు.

అధ్యయనం ప్రకారం.. ఉదయం పూట అల్పాహారానికి ముందు వ్యాయామం చేసిన వారిలో శరీరం ఎక్కువ మొత్తంలో కొవ్వును ఇంధనంగా వాడుకున్నట్లు తేలింది. ఈ కొవ్వు కరిగే ప్రక్రియ కేవలం వ్యాయామం చేసే సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా చాలా గంటల పాటు కొనసాగడం విశేషం. ఉదయం వేళ శరీరంలో గ్లైకోజెన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల శరీరం శక్తి కోసం నేరుగా కొవ్వు నిల్వలపై ఆధారపడుతుందని పరిశోధకులు వెల్లడించారు.

సాయంత్రం వేళ అదే వ్యాయామం చేసినప్పుడు ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. సాయంత్రం వ్యాయామం చేసే సమయంలో శరీరం కొవ్వు కంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్లను ఇంధనంగా ఉపయోగించుకుంది. రాత్రిపూట చేసిన వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు వెంటనే కాకుండా మరుసటి రోజు ఉదయానికి శరీరంలో కనిపిస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. అంటే సాయంత్రం చేసిన వర్కవుట్ ప్రభావం మరుసటి రోజు ఉదయం వరకు శరీరంలో కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

చివరిగా ఏ సమయంలో వ్యాయామం చేసినా కరిగే మొత్తం క్యాలరీల పరిమాణం ఒకేలా ఉంటుందని పరిశోధన స్పష్టం చేసింది. కాబట్టి వ్యాయామం చేయడానికి ఫలానా సమయం మాత్రమే ఉత్తమమని ఖచ్చితంగా చెప్పలేం. ఉదయం చేస్తే తక్షణ ఫలితాలు వస్తాయి. సాయంత్రం చేస్తే ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి, అంతే తేడా.. అంతిమంగా మీరు ఏ సమయంలో చేస్తున్నారు అనే దానికంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారా లేదా అనేదే ముఖ్యమని ఈ నివేదిక సారాంశం.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..