
శీతాకాలంలో స్నానం చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే తీవ్రమైన చలి కారణంగా నీళ్లను ముట్టుకోవాలంటేనే భయపడిపోతుంటారు. క్రమం తప్పకుండా స్నానం చేసేవారు కూడా శీతాకాలంలో గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తారు. ఇప్పుడు చాలా మందిలో ఓ అపోహ ఉంది. వేడి నీటిలో స్నానం చేయడం వల్ల ఎముకలు బలహీనపడతాయని ప్రజలు చెప్పడం మీరు తరచుగా విని ఉండవచ్చు. వేడి నీరు ఎముకలలోని కాల్షియంను కరిగించి, వాటిని బలహీనపరుస్తుందని నమ్ముతుంటారు. ఇది నిజమేనా? దీని గురించి తెలుసుకుందాం. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పులక్ వాత్స్య ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో దీని గురించి ప్రస్తావించారు.
వేడి నీటిలో స్నానం చేయడం వల్ల మీ ఎముకలలోని కాల్షియం కరిగిపోయి బలహీనపడుతుందనే వాదనలో ఎటువంటి నిజం లేదని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పులక్ వాత్స్యా వివరిస్తున్నారు. నిజానికి ఎముకల బలం మీ విటమిన్ డి స్థాయిలు, కాల్షియం, ప్రోటీన్ తీసుకోవడం, లైఫ్‌స్టైల్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు చల్లని నీటిలో స్నానం చేస్తున్నారా లేదా వేడి నీటిలో స్నానం చేస్తున్నారా అనేది పట్టింపు లేదు.
శీతాకాలం అయినప్పటికీ రోజూ స్నానం చేయడం మంచి అలవాటు అని, ఇది మీ పరిశుభ్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుందని డాక్టర్ పులక్ అంటున్నారు. చలిగా ఉందని స్నానం చేయకుండా ఉండటం వెనుక ఎటువంటి శాస్త్రీయ కారణం లేదు. అయితే బ్యాలెన్స్ సమస్యలు ఉన్నవారు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నరు ప్రతి 2-3 రోజులకు ఒకసారి స్నానం చేయాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
వేడి నీరు ఎముకలను బలహీనపరుస్తుందనే ఆలోచన ఒక అపోహ అయినప్పటికీ, శీతాకాలంలో చాలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల కొంతమందికి సమస్యాత్మకంగా ఉంటుంది. అధికంగా వేడి నీరు చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తుంది. దీని వలన పొడిబారడం, దురద, దద్దుర్లు వస్తాయి. ఇంకా, ఎక్కువసేపు వేడి స్నానం చేయడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది.
శీతాకాలంలో స్నానం చేసేటప్పుడు చాలా వేడి నీటిని ఉపయోగించవద్దు. చాలా వేడిగా లేని, కానీ చల్లగా అనిపించని నీటిని ఎంచుకోండి. స్నానం చేసిన వెంటనే మీ చర్మాన్ని పూర్తిగా తుడిచి ఆపై ఎక్కువగా ఎండకుండా ఉండటానికి మాయిశ్చరైజర్ లేదా నూనె రాయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహణ కోసం మాత్రమే. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)