
వంటల్లో రుచికి, ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు.. ఇలా రోజువారీ జీవితంలో నిమ్మకాయ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయలకు మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే చాలామంది తమ ఇళ్లల్లో, బాల్కనీలలో లేదా పెరట్లో నిమ్మ మొక్కలను ఎంతో ఇష్టంగా నాటుతుంటారు. అయితే చాలా సందర్భాల్లో మొక్క ఏపుగా పెరిగినా పూత రాకపోవడం, పూత వచ్చినా పిందె కట్టకుండా రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సరైన సంరక్షణ, సరైన పోషకాలు అందిస్తే కుండీలోనే గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు పండించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
నిమ్మ మొక్కలను నాటడానికి వర్షాకాలం, ఫిబ్రవరి నుంచి మార్చి అత్యంత అనుకూలమైన సమయాలు. నర్సరీ నుంచి మొక్క తెచ్చుకునేటప్పుడు కనీసం 6 నెలల వయసున్న అంటుకట్టిన లేదా బహువార్షిక రకాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా కాగ్జీ నిమ్మ వంటి రకాలు ఇళ్లల్లో పెంచడానికి బాగా అనుకూలం. ఒకవేళ నర్సరీ నుంచి తెచ్చిన మొక్కకు అప్పటికే కాయలు ఉంటే, కుండీలో నాటిన వెంటనే వాటిని కోసేయాలి. దీనివల్ల మొక్క వేర్లు కుదురుకుని, ఎదుగుదల వేగవంతం అవుతుంది.
కుండీ సైజు: నిమ్మ చెట్టు వేర్లు బలంగా విస్తరించడానికి కనీసం 18 అంగుళాల లోతు ఉన్న పెద్ద కుండీని ఎంచుకోవాలి. కుండీ అడుగున నీరు సాఫీగా బయటకు పోయేలా రంధ్రాలు ఉండాలి.
మట్టి తయారీ: రాళ్లు లేని సారవంతమైన తోట మట్టిని తీసుకోవాలి. అందులో సమాన నిష్పత్తిలో వర్మీకంపోస్ట్, బాగా మాగిన ఆవు పేడ ఎరువును కలపాలి.
వేరు తెగుళ్ల నివారణకు: వేర్లకు ఫంగస్ సోకకుండా 250 గ్రాముల వేపపిండిని మట్టిలో తప్పనిసరిగా కలపాలి.
ఖనిజ పోషకాలు: నిమ్మకు కాల్షియం చాలా అవసరం. కాబట్టి 500 గ్రాముల రాతి పొడి, ఒక గుప్పెడు ఐరన్ డస్ట్ మట్టిలో కలిపి మొక్కను నాటుకోవాలి.
ఎండిపోయిన, తెగుళ్లు సోకిన, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. ప్రూనింగ్ చేయడం వల్ల మొక్క దట్టంగా మారి, కొత్త చిగుర్లు వచ్చి పూత విరివిగా వస్తుంది. వర్షాకాలంలో బరువు వల్ల వంగిపోయే కొమ్మలకు వెదురు కర్రలతో ఆధారం కల్పించాలి.
మార్చి నుంచి సెప్టెంబర్ వరకు నిమ్మ చెట్టు వేగంగా పెరిగే సమయం కాబట్టి క్రమం తప్పకుండా పోషకాలు అందించాలి.
మార్చి మార్చి ఎరువులు: ప్రతి 20–25 రోజులకు ఒకసారి గుల్ల చేసి వర్మీకంపోస్ట్ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేయాలి. ఒక నెల ఘన ఎరువు ఇస్తే, మరుసటి నెల ద్రవ ఎరువు ఇవ్వడం మంచిది.
పొటాషియం లిక్విడ్: అరటిపండు, బంగాళాదుంప తొక్కలను ఎండబెట్టి పొడి చేసి, నీటిలో కలిపి నెలకు ఒకసారి కుండీలో పోస్తే పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. అలాగే పచ్చి బంగాళాదుంప పేస్ట్ నీటిని లేదా చిటికెడు పటిక నీటిని కూడా పోయవచ్చు.
ఆవపిండి ద్రావణం: మొక్క పూత దశకు వచ్చే ముందు, ఆపై పిందెలు ఏర్పడే సమయంలో ఆవపిండి ఎరువును (మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్) రెండుసార్లు అందిస్తే దిగుబడి అద్భుతంగా ఉంటుంది.
సీవీడ్ ఎరువు: పూత ఎక్కువగా రావడానికి ఎరుపు-గోధుమ సముద్రపు నాచుతో తయారు చేసిన ‘సాగరిక’ వంటి సేంద్రియ ద్రవాన్ని లీటరు నీటిలో ఒక మూత కలిపి పోస్తే 15 రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
నిమ్మ ఆకులపై గొంగళి పురుగులు, రసం పీల్చే పురుగుల దాడి సర్వసాధారణం. వీటి నివారణకు ప్రతి 15 రోజులకు ఒకసారి లీటరు నీటిలో 5 ఎంఎల్ వేపనూనె కలిపి మొక్క మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి.