
వర్షాకాలంలో మన బాడీలో రోగనిరోదక శక్తి తగ్గిపోతుంది. తద్వారా మనం త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వానాకాలంలో మనం శరీరాన్ని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మనం పోషకమైన ఆహారం తీసుకోవాలి. అలాంటి వాటిలో కోతిమీర, టమాటాలతో చేసిన పచ్చడి కూడా మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానితో పాటు రుచికరంగాను ఉంటుంది.కాబట్టి దీన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.0
కొత్తిమీర టమోట పచ్చిడికి కావలసిన పదార్థాలు
తయారీ విధానం:
కొత్తమీర టమోటా పచ్చడి తయారు చేసుకునేందుకు ముందుగా 1/2 కిలో టమాటోలను తీసుకొని, శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి, కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
మినప్పప్పు వేయించడం: తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక, రెండు స్పూన్ల మినప్పప్పు వేసి, మీడియం ఫ్లేమ్‌లో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఈ పచ్చడికి పొట్టు మినప్పప్పు అయితే రుచి చాలా బాగుంటుంది. వేగిన మినప్పప్పును మిక్సీ జార్ లోకి తీసుకోవాలి.
పచ్చిమిరపకాయలు వేపుడు: అదే పాన్ లో మరికొద్దిగా నూనె అవసరం పడవచ్చు. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. పచ్చళ్ళు కాస్త కారంగా ఉంటేనే రుచిగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు బాగా వేగాక, వాటిని కూడా మిక్సీ జార్ లోకి తీసుకోవాలి.
కొత్తిమీర వేయించడం: అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి, కట్ చేసుకున్న కొత్తిమీరను వేయించుకోవాలి. కొత్తిమీరను మరీ చిన్నగా కట్ చేయకుండా, కాస్త పెద్దగానే ఉంచి, పచ్చివాసన పోయి, రంగు మారేవరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. వేగిన కొత్తిమీరను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
టమాటోలు మగ్గించడం: ఇప్పుడు టమాటో ముక్కలు మగ్గించుకోవడానికి సరిపడా నూనె పాన్ లో వేసుకోవాలి. నూనె వేడయ్యాక, కట్ చేసుకున్న టమాటో ముక్కలు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. పసుపు వేయడం వల్ల పచ్చడికి మంచి రంగు వస్తుంది. మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. టమాటోలు బాగా మెత్తగా మగ్గి, నీరు ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి.
పచ్చడి రుబ్బుకోవడం: ముందుగా మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న మినప్పప్పు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా. వాటిలో తగినంత ఉప్పు, అర స్పూన్ జీలకర్ర, ఐదు వెల్లుల్లి రెక్కలు, చిన్న ముక్క చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ వేయకూడదు, లేదంటే పచ్చడి పుల్లగా ఉంటుంది.
చివరిగా కలపడం: ఇప్పుడు మెత్తగా రుబ్బిన మిశ్రమంలో, ముందుగా మగ్గించుకున్న చల్లారిన టమాటో ముక్కలు, వేయించిన కొత్తిమీర కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా రుబ్బకుండా, కాస్త కచ్చాపచ్చాగా ఉంచితే రోటి పచ్చడి లాగా రుచిగా ఉంటుంది. కొత్తిమీర, టమాటో ముక్కలు అక్కడక్కడా కనిపిస్తుంటేనే బాగుంటుంది.
ఈ కొత్తిమీర టమాటో పచ్చడికి పోపు పెట్టనవసరం లేదు, ఇలానే రుచిగా ఉంటుంది. మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి ఒక రోజు వరకు బయట నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే నాలుగు రోజుల వరకు పాడవ్వదు. అన్నం, దోసె, ఇడ్లీ, రొట్టెలకు ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.