
వేసవిలో పెరుగు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు పెరుగు ఆహారానికి అదనపు రుచిని ఇస్తుంది. కొంతమంది ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ఇంట్లో పెరుగుని తోడు పెట్టుకుంటారు. మరికొందరు షాప్స్ నుంచి కొని తెచ్చుకుంటారు. అయితే షాప్స్ నుంచి తెచ్చుకున్న పెరుగు కొద్దిసేపటికే పుల్లగా మారుతుంది. వేసవిలో పెరుగు తినడం వల్ల కడుపు, జీర్ణవ్యవస్థకు మంచిది . అయితే వేసవిలో పెరుగు త్వరగా పుల్లగా మారుతుంది. లేదా పెరుగు త్వరగా చెడిపోతుంది. ఈ రోజు పెరుగు పులవ కుండా ఏమి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.
పాలలో ఉండే లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకోకస్ అనే బాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తాయి. అందువల్ల గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచినప్పుడు పాలు పెరుగుగా మారుతాయి. పాలు పెరుగుగా మారిన తర్వాత, ఇదే బ్యాక్టీరియా వృద్ధి చెందడం, పెరగడం ప్రారంభిస్తుంది. దీని వలన పెరుగు మరింత పుల్లగా మారుతుంది. ఒకొక్కసారి దీనిపై ఆకుపచ్చ బూజు పెరగడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పెరుగుని ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి హానికరం. కొన్నిసార్లు అధిక తేమ, అధిక కిణ్వ ప్రక్రియ, నిల్వ చేసే విషయంలో చేసే తప్పులు కూడా పెరుగు చేడిపోవడానికి కారణం.
ఇంట్లో తయారుచేసిన లేదా దుకాణంలో కొన్న పెరుగు త్వరగా చెడిపోతుంటే.. పెరుగును వెండి వస్తువులు లేదా ప్లాస్టిక్ పాత్రలలో నిల్వ చేయడానికి బదులుగా.. పెరుగుని సిరామిక్ లేదా గాజుతో చేసిన జాడిలలో నిల్వ చేయండి. ఇలా చేయడం వలన పెరుగు పుల్లగా మారదు. ఎక్కువసేపు తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగును రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఏమిటంటే పెరుగుమీద మూత పెట్టరు. దీనిని ఇలా తెరచి ఉంచడం వలన పెరుగుపై బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. రుచిని పాడు చేస్తుంది. పెరుగు మీద మూత పెట్టకపోతే రిఫ్రిజిరేటర్ గ్యాస్ వాసన పెరుగులోకి చేరుతుంది. పెరుగు త్వరగా చెడిపోతుంది. ప్రిడ్జ్ లో పెరుగు నిల్వ చేసే సమయంలో పెరుగు గిన్నె మీద మూత వేసి పెట్టడం వలన పెరుగు కమ్మటి వాసనతో రుచికరమగా ఉంటుంది. పెరుగు తాజాగా ఉంచుతుంది.
ఎక్కువ సమయం బయట పెట్ట వద్దు: పెరుగుని ఉపయోగించిన తర్వాత ఆ పెరుగుని బయట పెట్టేస్తారు. ఇలా చేయడం వలన పెరుగు త్వరగా పుల్లగా మారుతుంది. అయితే ఇలాంటి పెరుగుని ఒక గాజు గిన్నెలో వేసి ప్రిడ్జ్ లో పెట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వలన పెరుగు త్వరగా పుల్లగా మారదు.
పాలలో మజ్జిగ వేసి పెరుగుని తోడు పెట్టిన తర్వాత గిన్నె పై మూత వేసి పెట్టండి. పాలు తోడు కోవడానికి గది ఉష్ణోగ్రత అవసరం. కనుక పాలను తోడు పెట్టుకున్న తర్వాత పెరుగు అయ్యాక.. ఆ పెరుగుని ఫ్రిజ్‌లో పెడితే పెరుగు పుల్లగా మారదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)