టూత్ బ్రష్ కడిగేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. కోట్లాది బ్యాక్టీరియా మీ శరీరంలోకి..

రోజూ ఉదయం లేవగానే మన నోటిని శుభ్రం చేసుకోవడానికి వాడే టూత్‌బ్రష్.. నిజానికి మనల్ని రోగాల పాలు చేస్తుందని మీకు తెలుసా? అవును, దంతాలు మెరిసిపోవాలని మనం వాడే ఆ బ్రష్‌పై.. కంటికి కనిపించని కోట్లాది ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు దాగి ఉన్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అసలు బ్రష్‌ను క్లీన్ చేయడానికి సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టూత్ బ్రష్ కడిగేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. కోట్లాది బ్యాక్టీరియా మీ శరీరంలోకి..
How To Clean A Toothbrush

Updated on: May 29, 2026 | 8:10 PM

నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్రతిరోజూ ఉదయం, రాత్రి టూత్‌పేస్ట్‌తో పళ్లను శుభ్రం చేసుకుంటాం. కానీ దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగించే టూత్‌బ్రష్ ఎంతవరకు శుభ్రంగా ఉందో ఎప్పుడైనా గమనించారా? మనం వాడే బ్రష్‌ను సరిగ్గా నిర్వహించకపోతే, అది కోట్లాది బ్యాక్టీరియాలకు నిలయంగా మారి మనల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి పరిశుభ్రతపై ప్రముఖ అంతర్జాతీయ వైద్య పరిశోధనా వేదిక పబ్‌మెడ్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం కళ్లు తెరిపించే నిజాలను వెల్లడించింది. ఒక ప్రభుత్వ హాస్టల్‌లో నివసిస్తున్న 12-14 సంవత్సరాల వయస్సు గల 32 మంది పిల్లలపై శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేశారు. వారిని నాలుగు గ్రూపులుగా విభజించి, వారికి టూత్‌బ్రష్‌లు ఇచ్చారు. వివిధ సమయాల్లో ఆ బ్రష్‌లను పరీక్షించగా.. వాటిపై తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా పేరుకుపోయినట్లు గుర్తించారు. కేవలం నోరు పుక్కిలించడం లేదా పళ్లు తోముకోవడం మాత్రమే నోటి పరిశుభ్రత కాదని, దానికి ఉపయోగించే పరికరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యమని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.

బ్రష్ నిర్వహణలో మనం చేసే 3 సాధారణ తప్పులు

మన దైనందిన జీవితంలో టూత్‌బ్రష్‌ను ఉపయోగించిన తర్వాత చాలా మంది చేసే కొన్ని పొరపాట్లు బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతున్నాయి.

వెంటనే బ్రష్‌ను సరిగ్గా కడగకపోవడం: చాలా మంది బ్రష్ చేసిన వెంటనే దాన్ని ఏదో పైపైన నీళ్లతో కడిగేసి పక్కన పడేస్తారు. దీనివల్ల బ్రష్ వెంట్రుకల మధ్య మురికి, లాలాజలం, మలినాలు అలాగే ఉండిపోతాయి. కొంతమంది బ్రష్‌ల మొదట్లో టూత్‌పేస్ట్ తెల్లగా పేరుకుపోవడానికి ఈ నిర్లక్ష్యమే కారణం.

హ్యాండిల్‌ను అస్సలు పట్టించుకోకపోవడం: బ్రష్ చేసేటప్పుడు మన చేతి మురికి, బ్యాక్టీరియా, నోటి నుంచి వచ్చే నురుగు బ్రష్ హ్యాండిల్‌కు కూడా అంటుకుంటుంది. చాలా మంది కేవలం పైన ఉన్న వెంట్రుకలను మాత్రమే కడుగుతారు కానీ హ్యాండిల్‌ను క్లీన్ చేయరు.

వాష్ బేసిన్‌పైనే వదిలేయడం: బాత్రూమ్‌లోని వాష్‌బేసిన్ మీద లేదా దాని పక్కన బ్రష్‌లను ఓపెన్‌గా వదిలేయడం అత్యంత ప్రమాదకరం. ఆ ప్రదేశం ఎప్పుడూ తేమగా ఉండటం వల్ల బ్యాక్టీరియా త్వరగా వ్యాప్తి చెందుతుంది. పైగా వేరొకరు చేతులు కడుక్కునేటప్పుడు లేదా ఉమ్మేసేటప్పుడు ఆ క్రిములు నేరుగా మీ టూత్‌బ్రష్‌కు అంటుకునే అవకాశం ఉంది.

టూత్‌బ్రష్‌ను ఎలా శుభ్రం చేయాలి?

కంటికి కనిపించని ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పక పాటించాలి.

క్షుణ్ణంగా కడగాలి: బ్రష్ చేసిన తర్వాత, దానిపై ఉన్న టూత్‌పేస్ట్ అవశేషాలు, మురికి పూర్తిగా తొలగిపోయే వరకు వేళ్లతో రుద్దుతూ నీటి కింద క్లీన్ చేయాలి. హ్యాండిల్‌ను కూడా శుభ్రంగా కడగాలి.

పొడి ప్రదేశంలో భద్రపరచాలి: కడిగిన తర్వాత బ్రష్‌ను బాగా విదిల్చి, నీరు లేకుండా చేయాలి. తేమ లేని, గాలి ఆడే పొడి ప్రదేశంలో దాన్ని నిలువుగా ఉంచాలి. బ్యాక్టీరియా చేరకుండా క్యాప్స్ లేదా కవర్లను ఉపయోగించడం మంచిది.

వారానికి ఒకసారి శానిటైజ్: ప్రతి కొన్ని రోజులకు ఒకసారి మీ టూత్‌బ్రష్‌ను యాంటీ బాక్టీరియా గుణాలు ఉండే మౌత్‌వాష్‌‌లో కాసేపు నానబెట్టాలి. లేదా వారానికి ఒకసారి 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచడం ద్వారా బ్రష్‌పై ఉన్న క్రిములు పూర్తిగా నశిస్తాయి.

Follow Us