
దిండు లేకుండా పడుకోవడమే ఉత్తమమని చాలా మంది అనుకుంటారు. కానీ ‘బోల్డ్ స్కై’ ఆర్థోపెడిక్ నిపుణులు ఇటీవల జారీ చేసిన నివేదిక ప్రకారం.. దిండు ప్రధాన విధి మెడ, వెన్నెముకను ఒక నిర్దిష్ట సరళ రేఖలో ఉంచడమే. మీ దిండు సరైన ఎత్తులో ఉంటే అది మెడ సహజ వంపును కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది మెడ కండరాలకు విశ్రాంతినిచ్చి, నొప్పి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం అనేక మార్కెట్లో యాంటీ-అలర్జెనిక్ దిండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి శ్వాసకోశ సమస్యలు ఉన్న రోగులను దుమ్ము నుంచి కాపాడతాయి. ముఖ్యంగా సైనస్ లేదా మైగ్రేన్ సమస్యలు ఉన్నవారికి తలను కొద్దిగా పైకి ఎత్తి పడుకోవడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
అయితే మరోవైపు దిండు లేకుండా నిద్రపోవడం వల్ల కొన్ని శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దిండు లేకుండా చదునుగా పడుకున్నప్పుడు వెన్నెముక దాని సహజ స్థితిలో ఉంటుంది. వెల్లకిలా పడుకునే వారికి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల ముఖ చర్మంపై అదనపు ఒత్తిడి పడదు. ఇది దీర్ఘకాలంలో ముడతలు లేదా మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది తల, మెడలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి, ఉదయం నిద్రలేచినప్పుడు శరీరం మరింత తాజాగా అనిపిస్తుంది.
నిజం ఏమిటంటే మీరు దిండు వాడాలా? వద్దా? అనేది మీ శరీరాకృతి, నిద్రించే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. మీరు పక్కకు తిరిగి పడుకుంటే మీ మెడ, భుజాల మధ్య దూరాన్ని సమతుల్యం చేయడానికి దిండు చాలా అవసరం. మీకు బోర్లా పడుకునే అలవాటు ఉంటే దిండు లేకుండా పడుకోవడం మంచిది. లేకపోతే మీ వెన్నెముకపై ఒత్తిడి పడవచ్చు. దిండు వాడటం వల్ల మీకు మెడ నొప్పి వస్తున్నట్లు అనిపిస్తే పలుచని దిండును ప్రయత్నించవచ్చు. లేదంటే వైద్య నిపుణులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నిద్రే ఆరోగ్య శ్రేయస్సుకు కీలకం. మీకు దీర్ఘకాలిక నొప్పి సమస్యలు ఏవీ లేకపోతే సౌకర్యవంతంగా ఉండి, ఉదయాన్నే ఉత్సాహంగా అనిపించే భంగిమ ఏదైనా మీరు ప్రయత్నించవచ్చు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, పరిష్కారాలు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉన్నాయి. మేము వాటిని ఆమోదించడం లేదు. దయచేసి వాటిని అనుసరించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.