Pregnancy: గర్భిణీలు పుచ్చకాయ తినడం మంచిదేనా.? నిపుణులు ఏమంటున్నారంటే

గర్భిణీలు ఎలాంటి సందేహం లేకుండా పుచ్చకాయను ఆహారంలో భాగం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులోని పోషకాలు తల్లితో పాటు కడుపులో బిడ్డకు కూడా ఉపయోగపడతాయి. పుచ్చకాయలో ఉండే దాదాపు 92 శాతం నీరు శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా...

Pregnancy: గర్భిణీలు పుచ్చకాయ తినడం మంచిదేనా.? నిపుణులు ఏమంటున్నారంటే
Watermelon

Updated on: Jun 15, 2024 | 9:20 AM

సాధారణ సమయాలతో పోల్చితే గర్భిణీలుగా ఉన్న సమయంలో మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలనే విషయం తెలిసిందే. తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానం వరకు అన్నింటిలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. అయితే ఇదే సమయంలో గర్భిణీలకు ఎన్నో అపోహలు ఉంటాయి. ఇలాంటి వాటిలో పుచ్చకాయ తీసుకోవడం మంచిదా.? కాదా.? అనే అనుమానం వస్తుంది. ఇది చాలా మందిలో ఉండే సాధారణమైన సందేహం. ఇంతకీ గర్భిణీలు పుచ్చకాయ తీసుకోవడం మంచిదేనా..? కాదా ఇప్పుడు తెలుసుకుందాం..

గర్భిణీలు ఎలాంటి సందేహం లేకుండా పుచ్చకాయను ఆహారంలో భాగం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులోని పోషకాలు తల్లితో పాటు కడుపులో బిడ్డకు కూడా ఉపయోగపడతాయి. పుచ్చకాయలో ఉండే దాదాపు 92 శాతం నీరు శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉమ్మనీరు స్థాయిలు తగ్గకుండా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అకాల డెలివరీలతో పాటు అనే సమస్యలకు డీహైడ్రేషన్‌ కారణంగా చెప్పొచ్చు. అందుకే అధికంగా నీరు ఉండే పుచ్చకాయ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

ఇక పుచ్చకాయలో విటమిన్‌ ఎ, సి, బి6 పుష్కలంగా లభిస్తాయి. ఇవి తల్లితోపాటు, పెరుగుతున్న బిడ్డకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడితే, విటమిన్‌ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. విటమిన్ B6 శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది.

అలాగే గర్భిణీలు పుచ్చకాయ తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే సాధారణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గర్భంతో ఉన్న సమయంలో మహిళల కాళ్లలో, చేతుల్లో వాపు కనిపించడం సర్వసాధారణం అయితే పుచ్చకాయ ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇక గర్భధారణ సమయంలో గుండెల్లో మంట అనేది మరొక సాధారణ సమస్య. పుచ్చకాయ కడుపులోని యాసిడ్‌ను తటస్థీకరించడంలో సహాయపడుతుంది. ఇది గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కాకుండా, పుచ్చకాయలోని ఫైబర్ పరిమాణం జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. గర్భిణీలు సహజంగా కనిపించే సమస్యల్లో మలబద్ధకం ఒకటి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. ఇక పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదే అయితే అతిగా తీసుకుంటే మాత్రం డయేరియా సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్భిణీలు వైద్యుల సూచనల మేరకు ఆహారాన్ని తీసుకోవడమే మంచిది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..