
జీవితంలో చాలా మంది ఆనందంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటారు. అందుకు తగినట్లుగా ప్రయత్నం చేస్తుంటారు. అయితే, చాలా మంది తాము ఉన్న ప్రస్తుత పరిస్థితిని ఇష్టపడరు. అది ఏ స్థాయిలో ఉన్న సరే. తాము ఏ రంగంలో ఉన్నా.. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కొంత అసంతృప్తితో ఉంటారు. అన్ని తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ వారిలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంటుంది. తమకు అవసరమైనది లేనప్పుడు అసంతృప్తికి గురికావడంలో తప్పులేదు.. కానీ, అన్నీ ఉన్నా అలాంటి పరిస్థితిలో ఉన్నారంటే మాత్రం వారికి జీవితంలో ఆనందం అనేది దుర్లభమే అవుతుందని చెప్పవచ్చు.
ఎందుకంటే వారు ఎప్పుడూ లేనిదాని గురించి ఆలోచిస్తూ ఆనందాన్ని ఆస్వాదించలేరు. దీనికి మరోవైపునకు చూసుకుంటే.. కొందరు తమకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ.. అదే జీవితాన్ని కొనిసాగిస్తుంటారు. ఏదో ఒక పనిలో లేదా రంగంలో ఇరుక్కుపోయి ఉంటారు. తమ ఆనందాలకు అవకాశం లేకపోయినప్పటికీ.. అవసరాల కోసం అలాగే జీవించేస్తుంటారు. ఇది కూడా వారికి సంతృప్తిని కలిగించదు. ఇలాంటి పరిస్థితులకు సంబంధించి కొన్ని ఉదాహరణలను ఇప్పుడు గమనిద్దాం.
ఒక మొండి పిల్లవాడిని అతని తండ్రి దగ్గరకు పిలిచారు. ఆ బాలుడిని చూస్తూ.. “కోతుల వేటగాళ్ళు వాటిని ఎలా పట్టుకుంటారో నీకు తెలుసా?” అని అడిగాడు. తరువాత అతను దానిని వర్ణించడం ప్రారంభించాడు.. “ముందుగా వారు కోతికి ఇష్టమైన ఆహారాన్ని పెద్ద గాజు జాడిలో ఉంచుతారు. జాడి మెడ చాలా ఇరుకైనదిగా ఉంటుంది.
కోతి ఆహారాన్ని చూడగానే.. అది తన తలను జాడిలోకి దూర్చుతుంది. ఆహారాన్ని తింటుంది. అయితే, ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత, దాని తల బయటకు రాదు. మరోవైపు, కోతి ఆహారాన్ని వదలడానికి ఇష్టపడదు. అదే సమయంలో, అది జాడిలో ఇరుక్కుపోయి, బయటకు రాలేక అరుస్తుంది. ఆ సమయంలో, అక్కడ దాక్కున్న వేటగాళ్ళు అక్కడికి వచ్చి దాన్ని పట్టుకుంటారు. ఈ విధంగా ఆయన వివరించగానే.. ఆ అబ్బాయికి కొంత అర్థమైంది. దేనికీ ఎప్పుడూ బానిస కాకూడదనే విషయం తెలిసింది.
మనం కొన్ని విషయాలను అలాగే వదిలేసి, మన భవిష్యత్తును వేరే మార్గంలో పెట్టుకుని ముందుకు సాగాలి. ఆ తెలివైన అబ్బాయి వెంటనే దీన్ని గ్రహించాడు. ఆ రోజు నుంచి అతను తన మెండితనాన్ని వీడిటంతోపాటు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేశాడు.
ఒకరోజు ఒక ప్రముఖ వ్యాపారవేత్త బీచ్ వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా.. ఒక జాలరి తన బుట్టలో పెద్ద చేపలతో తిరిగి వచ్చాడు.
ఆ వ్యాపారవేత్త చాలా చేపలను చూసి ఆశ్చర్యపోయాడు. జాలరిని “నువ్వు ఎంతకాలం నుంచి చేపలు పడుతున్నావు?” అని అడిగాడు.
ఎంతో కాలం కాదు.. రెండు గంటల నుంచే అని చెబుతాడు.
ఆ వ్యాపారవేత్త, “ఓహ్, నువ్వు చాలా చేపలు పట్టావు. తర్వాత ఏం చేస్తావు?” అని అడిగాడు. “నేను ఇంటికి వెళ్తాను. నా కుటుంబంతో సరదాగా గడుపుతాను. సాయంత్రం, నేను సిటీ హాల్‌కి వెళ్లి నా స్నేహితులతో సరదాగా గడుపుతాను” అని అతను చెప్పాడు. ఆ వ్యాపారవేత్త వెంటనే, “నువ్వు ఇంకొంచెం సేపు చేపలు పడితే, నీకు మరిన్ని చేపలు దొరుకుతాయి” అన్నాడు.
“దానితో నేనేం చేయాలి? ఇప్పుడు నాకు నచ్చినవి కూడా నా పొరుగువారికి, స్నేహితులకు ఇస్తాను” అన్నాడు జాలరి.
“నేను నీకు ఒక విషయం చెప్తాను, చేస్తావా? మరిన్ని చేపలు పట్టు. నువ్వు వాటిని అమ్మి చాలా డబ్బు సంపాదించవచ్చు. ఆ డబ్బుతో, నువ్వు నీ చిన్న పడవను వదిలివేయవచ్చు. నువ్వు పెద్ద పడవ కొనవచ్చు. దాని నుంచి నీకు వచ్చే డబ్బుతో, నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు…” .. వ్యాపారవేత్త తన వ్యాపార మెదడును ఉపయోగించి జాలరికి సలహా ఇచ్చాడు.
“అప్పుడు?” అని అడిగాడు జాలరి.
“అప్పుడు మనం పని నుంచి రిటైర్ అయి, మన కుటుంబంతో సమయం గడపవచ్చు. సాయంత్రాలు, స్నేహితులతో సమావేశమై సరదాగా గడపవచ్చు” అని వ్యాపారవేత్త అన్నాడు.
“నేను ఇప్పుడు చేస్తున్నది అదే” అంటూ వ్యాపారికి జాలరి ఆశ్చర్యకర సమాధానమిచ్చాడు.
మీకు సంతోషాన్నిచ్చే జీవితం ఉంటే.. మీరు దానిని కొనసాగించాలి. ఒత్తిడి, అధిక పని మీ ఆనందాన్ని, శాంతిని దోచుకుంటాయి. సంతృప్తికరమైన జీవితమే విజయవంతమైన జీవితం అని తెలుసుకోవడంలో ఆలస్యం చేయవద్దు.