
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో మతిమరుపు ఒకటి. ఇంట్లో ఏదైనా వస్తువు ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, కొత్తగా పరిచయమైన వ్యక్తి పేరు గుర్తుకు రాకపోవడం, చేయాల్సిన పనులను మరిచిపోవడం వంటి సమస్యలు తరచూ కనిపిస్తున్నాయి. అయితే, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.
మెదడు ఆరోగ్యానికి విటమిన్ B12, విటమిన్ B9 (ఫోలిక్ యాసిడ్) ఎంతో కీలకం. ఇవి నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని కోసం పాలు, గుడ్లు, చేపలు, మాంసం, ఆకుకూరలు, బీన్స్ , తృణధాన్యాలు, ఫోర్టిఫైడ్ సెరియల్స్ తినాలి.
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పాలీఫెనాల్స్ మెదడు కణాలను రక్షించడంలో సహాయపడతాయి. ఇవి వయసుతో వచ్చే మెదడు క్షీణతను తగ్గించడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం బ్లూబెర్రీలు, బ్లాక్‌బెర్రీలు, దానిమ్మ, గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్ తీసుకోవాలి.
సబ్జా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడులో వాపును తగ్గించి, జ్ఞాపకశక్తిని కాపాడటానికి తోడ్పడతాయి. జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు వీటిని కూడా డైట్‌లో చేర్చుకోవాలి.
మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించడంతో పాటు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం లభించే ఆహారాలు: ఆకుకూరలు, బాదం, జీడిపప్పు వంటి నట్స్ ,సోయాబీన్స్, తృణధాన్యాలు, పాలు, సీ ఫుడ్స్
శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మెదడుకు కూడా అంతే అవసరం. సుడోకు, పజిల్స్, చెస్, క్రాస్‌వర్డ్‌లు వంటి బ్రెయిన్ గేమ్స్ ఆడడం వల్ల ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. అలాగే ప్రతిరోజూ కనీసం 7–8 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి.
నడక, యోగా, సైక్లింగ్ లేదా ఇతర శారీరక వ్యాయామాలు మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా మానసిక క్షీణత ప్రమాదం కూడా తగ్గుతుంది.
రోజూ కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే మరికొన్ని ట్రై చేయండి.
(నోట్: జ్ఞాపకశక్తి తగ్గడం ప్రతి సందర్భంలోనూ తీవ్రమైన వ్యాధికి సంకేతం కాకపోవచ్చు. అయితే తీవ్రమైన మతిమరుపు సమస్య ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి)