AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే లవంగం మొక్కను పెంచాలనుకుంటున్నారా? ఈజీగా పెంచుకోండిలా..!

లవంగం కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్క. ఇంట్లోనే లవంగం మొక్కను పెంచుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి. అయితే దీనిని పెంచడానికి ఎండబెట్టిన లవంగాలు పనికిరావు, కేవలం తాజా లవంగం విత్తనాలు లేదా కొమ్మల ద్వారా మాత్రమే పెరుగుతాయి. ఒక చిన్న విత్తనం నుండి నాటిన మొక్క పూర్తిగా ఎదిగి, పూల మొగ్గలను ఇవ్వడానికి సంవత్సరాల సమయం పడుతుంది. సరైన సంరక్షణ, ఓపిక ఉంటే దీనిని విజయవంతంగా పెంచవచ్చు. ఇంట్లోనే లవంగం మొక్కను ఎలా పెంచాలో ఇప్పుడు చూద్దాం..

ఇంట్లోనే లవంగం మొక్కను పెంచాలనుకుంటున్నారా? ఈజీగా పెంచుకోండిలా..!
How To Grow Clove Plant
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2026 | 4:19 PM

Share

భారతీయ వంటకాల్లో లవంగాలకు ప్రత్యేక స్థానం ఉంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ లవంగం మొక్కను మన తోటలో లేదా కుండీలలో కూడా పెంచుకోవచ్చు. కానీ, ఈ మొక్కను పెంచేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే..

మనం వంటల్లో వాడే ఎండబెట్టిన లవంగాల నుండి మొక్కలు మొలకెత్తవు. లవంగం మొక్కను పెంచడానికి పండిన లవంగం పండ్ల నుండి సేకరించిన తాజా విత్తనాలు అవసరం. లేదా నర్సరీల నుండి తెచ్చిన చిన్న లవంగం మొక్కలను నేరుగా నాటుకోవచ్చు. ఈ లవంగం చెట్లు ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతాయి. వీటికి 20°C నుండి 32°C ఉష్ణోగ్రత అనుకూలం. నేల విషయానికి వస్తే, నీరు నిల్వ ఉండకుండా బాగా ఇంకిపోయే ఇసుక లేదా జిగటతో కూడిన ఒండ్రు మట్టి ఉత్తమం. మట్టిలో తగినంత సేంద్రీయ ఎరువులు లేదా కంపోస్ట్ కలపాలి.

ఇవి కూడా చదవండి

తాజా విత్తనాలను మట్టిపై ఉంచి, తేమ ఆవిరి కాకుండా ప్లాస్టిక్ కవర్‌తో కప్పాలి. విత్తనం మొలకెత్తడానికి 1 నుండి 6 వారాల సమయం పడుతుంది. మొక్క కొద్దిగా పెరిగిన తర్వాత నేరుగా ఎండ తగలకుండా పాక్షిక నీడలో ఉంచాలి. లవంగం మొక్కలకు రోజూ 3 నుండి 6 గంటల పరోక్ష సూర్యరశ్మి సరిపోతుంది. మట్టిలో ఎప్పుడూ తేమ ఉండాలి కానీ, నీరు ఎక్కువై చిత్తడిగా మారకూడదు. మొక్క మొదట్లో ఎండుటాకులు లేదా మల్చింగ్ వేయడం వల్ల తేమ ఎక్కువ సేపు ఉంటుంది. అలాగే ఏటా ఎండిన కొమ్మలను కత్తిరించడం వల్ల గాలి ప్రసరణ బాగా జరిగి చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

లవంగం సాగులో అత్యంత ముఖ్యమైనది ఓపిక. ఎందుకంటే.. లవంగం చెట్లు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. విత్తనం నుండి నాటిన చిన్న మొక్క పెద్దదై, మొదటిసారి పూత పూయడానికి కనీసం 5 నుండి 7 సంవత్సరాల సమయం పడుతుంది. చెట్టుకు పూల మొగ్గలు వచ్చిన తర్వాత, అవి పూర్తిగా ఎదిగి లేత గులాబీ రంగులోకి మారడానికి మరో 6 నుండి 8 నెలలు పడుతుంది. ఈ గులాబీ రంగు మొగ్గలను విచ్చుకోకముందే చేత్తో కోసి, ఎండలో బాగా ఎండబెట్టాలి. అప్పుడు అవి ముదురు గోధుమ రంగులోకి మారి మనం వాడే లవంగాలుగా సిద్ధమవుతాయి.

లవంగం మొక్కను పెంచడం కొంత సమయంతో కూడుకున్నదే అయినప్పటికీ, ఇంట్లోనే పండించిన తాజా, రసాయనాలు లేని లవంగాలను అందుకోవడం తోట ప్రేమికులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి కొద్దిగా ఓపికతో మీ ఇంట్లో కూడా ఒక లవంగం మొక్కను నాటి చూడండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us