ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు.. చెఫ్ సీక్రెట్ ట్రిక్..
చలికాలం వచ్చిందంటే చాలు.. మహిళలకు వంటింట్లో ఎదురయ్యే అతిపెద్ద తలనొప్పి ఇడ్లీ, దోశ పిండి సరిగ్గా పొంగకపోవడమే.. రాత్రంతా ఉంచినా పిండి పులవక గట్టి ఇడ్లీలు తిని విసిగిపోయారా? అయితే మీ వంటింట్లో ఉండే ఒకే ఒక్క పచ్చిమిరపకాయతో ఈ సమస్యకు చిటికెలో చెక్ పెట్టవచ్చంటున్నారు ప్రముఖ మాస్టర్‌చెఫ్ పంకజ్ భదూరియా. పిండిని వెన్నలా పొంగించే ఆ సింపుల్ కిచెన్ ట్రిక్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

దక్షిణ భారతదేశంలో ఉదయం వేళ మెత్తటి ఇడ్లీలు, కరకరలాడే దోశలు ఘుమఘుమలాడుతాయి. అయితే ఈ రుచులకు ప్రాణం పిండి పులిసే విధానం. పిండి ఎంత బాగా పొంగితే టిఫిన్స్ అంత రుచిగా వస్తాయి. కానీ వాతావరణం చల్లబడినప్పుడు లేదా వర్షాకాలం, చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల పిండి రాత్రంతా ఉంచినా సరిగ్గా పులవదు. దీంతో ఇడ్లీలు గట్టిగా రావడం, దోసెలు పెనానికి అతుక్కోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యకు వంటింట్లోనే దొరికే ఒక సాధారణ పదార్థంతో చెక్ పెట్టవచ్చని ప్రముఖ మాస్టర్‌చెఫ్ పంకజ్ భదూరియా చెబుతున్నారు.
పచ్చిమిరపకాయ కాడతో మ్యాజిక్
పిండి త్వరగా, చక్కగా పొంగడానికి ఒక పచ్చిమిరపకాయను కాడతో సహా పిండి మధ్యలో ఉంచాలని చెఫ్ పంకజ్ భదూరియా సూచిస్తున్నారు. మిరపకాయ కాడను తుంచకుండా పిండిలో మునిగేలా ఉంచి పాత్రపై మూతపెట్టాలి. ఆపై ఆ గిన్నెను వంటగదిలోని ఏదైనా వెచ్చని ప్రదేశంలో కదల్చకుండా ఉంచాలి. పిండిని మాటిమాటికీ తెరిచి చూడటం లేదా కలపడం చేయకూడదు. కొద్ది గంటల్లోనే పిండి రెట్టింపు పరిమాణంలో పెరిగి, పైన చిన్న చిన్న బుడగలు వచ్చి అద్భుతంగా పులుస్తుంది.
కాడ వెనుక దాగున్న రహస్యమేంటి?
పచ్చిమిరపకాయ కాడపై సహజంగానే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయని భావిస్తారు. ఇవి పిండిలో పులిసే ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. పిండి సరిగ్గా పొంగినప్పుడు మాత్రమే అందులో గాలి బుడగలు చేరి ఇడ్లీలు మృదువుగా, దోసెలు క్రిస్పీగా మారతాయి. అయితే ఇది వంటింటి అనుభవంతో వస్తున్న సాంప్రదాయ చిట్కా మాత్రమేనని, దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించాలి.
పిండి బాగా పొంగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వెచ్చని వాతావరణం: పిండి పులవడానికి గది ఉష్ణోగ్రత అత్యంత కీలకం. చలికాలంలో పిండి పాత్రను మూసివున్న మైక్రోవేవ్ ఓవెన్ లేదా ప్రీ-హీట్ చేసిన కుక్కర్ లోపల ఉంచితే ఫలితం ఉంటుంది.
పాత్ర పరిమాణం: పిండి పొంగినప్పుడు పైకి రావడానికి వీలుగా పాత్రలో సగం వరకు ఖాళీ ఉండేలా పెద్ద గిన్నెను ఎంచుకోవాలి.
పప్పు, బియ్యం నిష్పత్తి: రుబ్బడానికి వాడే మినప్పప్పు నాణ్యత, బియ్యం నిష్పత్తి కూడా ఫెర్మెంటేషన్ సమయాన్ని ప్రభావితం చేస్తాయి.
ఇడ్లీ, దోశ పిండి పులవక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ చిన్న కిచెన్ హ్యాక్‌ను పాటిస్తే సులభంగా దూది లాంటి ఇడ్లీలను సిద్ధం చేసుకోవచ్చు.
