
మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు.. అంటే పడుతున్న వస్తువును పట్టుకోవడం లేదా ట్రాఫిక్ సిగ్నల్ పడగానే బ్రేక్ వేయడం వంటివి మన మెదడు ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను చెబుతాయని మీకు తెలుసా? మన ప్రతిచర్య టైమ్ కేవలం మన వేగాన్ని మాత్రమే కాదు, మన మెదడు ఎంత చురుగ్గా సమాచారాన్ని ప్రాసెస్ చేస్తోందో కూడా సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవును.. మన మెదడు ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడానికి ఖరీదైన పరీక్షలు అవసరం లేదు. ఒక చిన్న స్కేల్ ఉంటే చాలు. మనం ఒక వస్తువును ఎంత వేగంగా పట్టుకోగలము అనే దానిపైనే మన మెదడు చురుకుదనం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కళ్లతో చూసిన ఒక విషయాన్ని మెదడు అర్థం చేసుకుని, శరీరానికి ఆర్డర్ వేయడానికి పట్టే సమయాన్నే ప్రతిచర్య సమయం అంటారు. ఉదాహరణకు, చేతిలో నుండి జారిపోతున్న ఫోన్‌ను మనం ఎంత వేగంగా పట్టుకుంటామనేది మన మెదడు వేగాన్ని సూచిస్తుంది.
ఇందులో మెదడు మూడు దశల్లో పనిచేస్తుంది.
గుర్తించడం: కళ్లు లేదా చెవుల ద్వారా సమాచారాన్ని తీసుకోవడం.
అర్థం చేసుకోవడం: ఆ సమాచారాన్ని విశ్లేషించడం.
ఆదేశించడం: శరీరాన్ని స్పందించమని కోరడం.
ఇటీవల సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతిచర్య సమయం నెమ్మదించడం అనేది కేవలం వయస్సు పెరగడమే కాకుండా మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్‌కు ప్రారంభ సంకేతం కావచ్చు.
మీ మెదడు పనితీరును అంచనా వేయడానికి ఒక సాధారణ పరీక్ష ఉంది. దీనికోసం మీకు ఒక స్కేల్, ఒక స్నేహితుడు ఉంటే సరిపోతుంది.
పద్ధతి: మీ స్నేహితుడిని రూలర్‌ను నిటారుగా పట్టుకోమని చెప్పండి. మీ బొటనవేలు, చూపుడు వేలు రూలర్ యొక్క 0 మార్కు వద్ద పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ తాకకూడదు.
ప్రక్రియ: మీ ఫ్రెండ్ చెప్పకుండానే స్కేల్‌ను వదిలేయాలి. మీరు దాన్ని ఎంత వేగంగా పట్టుకోగలిగితే, మీ ప్రతిచర్య అంత వేగంగా ఉన్నట్లు లెక్క.
ఫలితం: స్కేల్ ఎక్కువ కిందకు పడిపోకముందే మీరు పట్టుకుంటే మీ మెదడు చాలా వేగంగా స్పందిస్తున్నట్లు అర్థం.
గమనిక: ఖచ్చితత్వం కోసం ఇలా 4-5 సార్లు చేసి సగటును చూడండి.
ప్రతిచర్య సమయం నెమ్మదించడానికి కేవలం అనారోగ్యమే కారణం కానక్కర్లేదు. అలసట, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా మెదడు మందగించవచ్చు. అయితే ఈ మార్పు నిరంతరంగా ఉంటూ, మతిమరుపు వంటి లక్షణాలు తోడైతే మాత్రం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
నిపుణుల సూచనల ప్రకారం కొన్ని మార్పులతో మెదడు వేగాన్ని పెంచుకోవచ్చు..
వ్యాయామం: నడక, యోగా మనస్సు, శరీర సమన్వయాన్ని పెంచుతాయి.
మెదడుకు పని: పజిల్స్ పూర్తి చేయడం, కొత్త భాషలు లేదా నైపుణ్యాలు నేర్చుకోవడం.
సరైన నిద్ర: రోజుకు 7-8 గంటల నిద్ర మెదడు రీఛార్జ్ అవ్వడానికి అవసరం.
ఆహారం: పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం.
ఈ 30 సెకన్ల పరీక్ష వైద్య నిర్ధారణ కాకపోయినా మన ఆరోగ్యం పట్ల మనకు ఒక ప్రాథమిక అవగాహనను కల్పిస్తుంది. మీ మెదడును నిరంతరం చురుగ్గా ఉంచుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను ముందే అరికట్టవచ్చు.