Vitamin B12 సరిపడా అందుతోందా? ఇది లోపిస్తే ప్రమాదం అంచున ఉన్నట్లే..
విటమిన్ బి12 ఎర్ర రక్త కణాలు, డీఎన్‌ఏ ఏర్పడటంలో కీలక పాత్ర వహిస్తుంది. మెదడు, నరాల కణాలను కూడా బలపరుస్తుంది. అందువల్లనే ఆరోగ్య నిపుణులు..
Vitamin B12 Deficiency: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడా విటమిన్లు, పోషకాలు, మినరల్స్ అవసరం. ఐతే నేటి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా అనేక మంది విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. గణాంకాల ప్రకారం ప్రపంచ మొత్తం జనాభాలో కేవలం 26 శాతం మందిలో మాత్రమే తగినంత మొత్తంలో బి12 విటమిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. విటమిన్ బి12 ఎర్ర రక్త కణాలు, డీఎన్‌ఏ ఏర్పడటంలో కీలక పాత్ర వహిస్తుంది. మెదడు, నరాల కణాలను కూడా బలపరుస్తుంది. అందువల్లనే ఆరోగ్య నిపుణులు విటమిన్ బి12 శరీరానికి చాలా అవసరమని అంటుంటారు. విటమిన్ బి12 లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నాలుక చర్మం ఎర్రబడటం, నోటి పూత, చిరాకు, డిప్రెషన్, కాళ్లు, చేతులు, పాదాల నొప్పులు వంటి లక్షణాలు ప్రాథమికంగా కనిపిస్తాయి.
వీటితోపాటు నాలుక పైభాగంలో చిన్న తెల్లటి దద్దుర్లు కనిపిస్తున్నాయి. ఈ విటమిన్ తక్కువగా ఉంటే శరీరం తగినంత ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. ఫలితంగా రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. లక్షణాలు కనిపిస్తే ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఆ తర్వాత డాక్టర్ సలహా మేరకు తాగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా శాకాహారులు, మధుమేహం ఉన్నవారిలో విటమిన్ బి12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది.