ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి, ప్రశాంతమైన నిద్ర అవసరమని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా కచ్చితంగా నిద్ర విషయంలో మనం రాజీ పడుతూనే ఉంటాం. నిద్ర లేమి సమస్య మానసిక సామర్థ్యాలను హరించడంతో పాటు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి మనిషికి 6 నుంచి 8 గంటల పాటు నిద్ర చాలా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. నిద్రపోవడం వల్ల వివిధ రుగ్మతలకు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నిద్ర లేకపోవడం వల్ల కలిగే అనార్థాలను నిపుణులు వివరిస్తున్నారు. వారు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.
నిద్ర లేమి శరీరంపై అలసట, ఏకాగ్రత లేకపోవడం, ఆందోళన, నిరాశ, అధిక రక్తపోటు వంటి ప్రభావాలకు కారణం అవుతుంది. ముఖ్యంగా నిద్ర లేకపోతే ఎక్కువగా తింటూ ఉంటారు. దీంతో అధిక బరువు సమస్యతో పాటు డైస్లిపిడెమియా, అనియంత్రిత చక్కెర స్థాయిలు వంటి అనేక ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. ఈ సమస్య ధీర్ఘకాలంలో ఉంటే గుండెపోటు, పక్షవాతం, గుండె వైఫల్యానికి దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేమి గుండె ధమనులలో కొలెస్ట్రాల్ నిక్షేపణ ప్రమాదాన్ని పెంచుతుంది. తద్వారా గుండెపోటు కొరోనరీ ధమనులలో బ్లాక్ అంతరాయాన్ని కూడా కలిగిస్తుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారిలో దాదాపు 20-30 శాతం వరకు గుండె ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిద్ర లేమి కూడా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగిస్తుంది, ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. రాత్రి సమయంలో, రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను వైద్య పరిభాషలో నాక్టర్నల్ హైపర్‌టెన్షన్ అని పిలుస్తారు. చాలా శాతం గుండె పోటుకు ఈ సమస్యే ప్రధాన కారణంగా ఉంటుంది. నిద్రలేమి కారణంగా మధుమేహం స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తగినంత నిద్రపోయేలా టైంటేబుల్‌ను సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, వైద్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ..