నీతి కథ: దురాశ ఫలితం..నిజాయితీ లేని సంపాదన సుఖాన్ని ఇవ్వదు..!

Moral Story: నీతి కథలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా మన జీవితానికి సరైన దారి చూపే విలువైన పాఠాలు. పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా మంచి–చెడును సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ కథలు సహాయపడతాయి. నిజాయితీ, స్నేహం, క్రమశిక్షణ, దయ వంటి మంచి గుణాలను ఈ కథలు మనకు నేర్పుతాయి. స్నేహం అనేది పవిత్రమైన బంధం. అందులో స్వార్థం, దురాశ ప్రవేశిస్తే అది తీవ్ర అనర్థాలకు దారి తీస్తుందని ఈ నీతి కథ స్పష్టంగా తెలియజేస్తుంది.

నీతి కథ: దురాశ ఫలితం..నిజాయితీ లేని సంపాదన సుఖాన్ని ఇవ్వదు..!
Greed Moral Story
Image Credit source: AI

Updated on: Jun 04, 2026 | 3:17 PM

నీతి కథలు కేవలం వినోదం కోసం కాకుండా మన జీవితానికి దారి చూపే పాఠాలు. పిల్లలతో పాటు పెద్దలు కూడా మంచి-చెడును సులభంగా అర్థం చేసుకోవడానికి నీతి కథలు సహాయపడతాయి. పిల్లలకు ఒక కథ రూపంలో నీతిని బోధిస్తే.. అది వారి మనసులో ఎక్కువ కాలం నిలుస్తుంది. నిజాయితీ, స్నేహం, క్రమశిక్షణ, దయ వంటి మంచి గుణాలు, విలువలను ఈ కథలు నేర్పుతాయి. స్నేహం అనేది జీవితంలో అత్యంత పవిత్రమైన బంధం. కానీ ఆ స్నేహంలో స్వార్థం, దురాశ ప్రవేశిస్తే అది ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో ఈ నీతి కథ స్పష్టంగా తెలియజేస్తుంది.

కథ

ఒక ఊరిలో మధు, రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ బాగా చదువుకున్నారు. అయితే సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో వారు పట్నానికి వెళ్లి వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. బయలుదేరే ముందు ఇద్దరూ ఓ అవగాహనకు వచ్చారు. పట్నంలో చేసే వ్యాపారంతో వచ్చే సంపాదనను ఇద్దరూ సమానంగా పంచుకుంటామని మాట ఇచ్చుకున్నారు. ఇది వారి మధ్య ఉన్న నమ్మకానికి చిహ్నం.

ఇద్దరూ కలిసి పట్నం వైపు పయనమయ్యారు. ప్రయాణంలో ఒక పాడుబడిన గుడి దగ్గర వారికి బంగారు నాణేలు నిండిన మూట దొరికింది. మొదట ఇద్దరూ తమ అదృష్టం పండిందని ఆనందపడి దానిని సమానంగా పంచుకోవాలని నిర్ణయించారు. కానీ ఆ సంపదను చూసిన వెంటనే మధు మనసులో దురాశ మొదలైంది. “ఇది మొత్తం నాదే కావాలి” అనే ఆలోచన అతన్ని తప్పుదారి పట్టించింది.

రవిని సమీపంలోని గ్రామానికి భోజనం తెచ్చేందుకు పంపించి, అతనిని దూరం చేయాలని మధు పన్నాగం పన్నాడు. అదే సమయంలో రవి మెదడులో కూడా చెడు ఆలోచన పుట్టింది. బంగారం మొత్తాన్ని దక్కించుకోవాలన్న కుయుక్తితో.. మధును తొలగించి ధనాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. విషం కలిపిన భోజనాన్ని మధు కోసం తీసుకువచ్చాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు ద్రోహంతో తొలగించుకుని.. మొత్తం బంగారాన్ని కొట్టేయాలనుకున్నారు.

రవి తిరిగి రాగానే మధు అతనిపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆకలితో ఉన్న మధు ఆహారం తినగా, అందులో ఉన్న విషం కారణంగా అతను కూడా మరణించాడు. చివరికి ఆ బంగారు నాణేలు ఎవరికీ దక్కలేదు.

నీతి

ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. దురాశ మనిషిని అంధుడిగా చేస్తుంది. స్నేహం, నమ్మకం, నిజాయితీని పక్కన పెట్టి సంపద కోసం తాపత్రయపడితే చివరికి నష్టం తప్ప లాభం ఉండదు. నిజాయితీతో కూడిన జీవితం మాత్రమే శాశ్వత సంతోషాన్ని ఇస్తుంది. దురాశను దూరం పెట్టి స్నేహాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.

దురాశ, అబద్ధం, మోసం వంటి చెడు అలవాట్లు ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో ఈ నీతి కథలో చక్కగా వివరించారు.

Follow Us