Gas Saving Tips: చలికాలంలో గ్యాస్ సిలిండర్ త్వరగా ఖాళీ అవుతోందా? ఈ ట్రక్స్ తో నెలాఖరు వరకు నో టెన్షన్!

చలికాలం వచ్చిందంటే చాలు.. వంటింట్లో గ్యాస్ ఖర్చు ఒక్కసారిగా పెరిగిపోతుంది. నీళ్లు వేడి చేయడం నుంచి, చల్లబడిన ఆహారాన్ని మాటిమాటికీ వేడి చేయడం వరకు సిలిండర్ వాడకం ఎక్కువవుతుంది. దీంతో నెల తిరగకముందే సిలిండర్ ఖాళీ అయిపోతోందని చాలామంది ఆందోళన చెందుతుంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే గ్యాస్ వృధా కావడానికి ప్రధాన కారణం. మీ వంటగదిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గ్యాస్‌ను ఎలా ఆదా చేయవచ్చో, సిలిండర్ ఎక్కువ కాలం రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

Gas Saving Tips: చలికాలంలో గ్యాస్ సిలిండర్ త్వరగా ఖాళీ అవుతోందా? ఈ  ట్రక్స్ తో నెలాఖరు వరకు నో టెన్షన్!
Save Cooking Gas In Winter

Updated on: Jan 09, 2026 | 8:10 PM

గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, ఒక్క చుక్క గ్యాస్ కూడా వృధా కాకుండా చూసుకోవడం గృహిణులకు పెద్ద సవాల్. ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల వంట చేయడానికి ఎక్కువ సమయం, ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. మరి ఈ ఖర్చును తగ్గించుకోవడం సాధ్యమేనా? అంటే.. ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు నిపుణులు. బర్నర్లు శుభ్రం చేయడం నుంచి ప్రెషర్ కుక్కర్ వాడకం వరకు, గ్యాస్ ఆదా చేసే ఐదు అద్భుతమైన చిట్కాలతో మీ గ్యాస్ బిల్లును తగ్గించుకునే మార్గాలు తెలుసుకుందాం..

1. సరైన బర్నర్ ఎంపిక: వంట చేసే గిన్నె పరిమాణాన్ని బట్టి బర్నర్‌ను ఎంచుకోవాలి. చిన్న గిన్నెను పెద్ద బర్నర్‌పై పెడితే మంట పక్కల నుంచి వృధా అవుతుంది. గిన్నె మొత్తం మంట తగిలేలా చూసుకుంటే వంట త్వరగా పూర్తవుతుంది.

2. బర్నర్ల పరిశుభ్రత: బర్నర్ రంధ్రాల్లో మురికి లేదా నూనె పేరుకుపోతే మంట సరిగ్గా రాదు. ఇది గ్యాస్ వినియోగాన్ని పెంచుతుంది. వారానికి ఒకసారి బర్నర్లను శుభ్రం చేయడం వల్ల నీలి రంగు మంట వస్తుంది, ఇది ఇంధనాన్ని సమర్థవంతంగా మండిస్తుంది.

3. ప్రెషర్ కుక్కర్, మూతలు: సాధారణ గిన్నెల కంటే ప్రెషర్ కుక్కర్ వాడటం వల్ల సగం గ్యాస్ ఆదా అవుతుంది. ఏదైనా వండేటప్పుడు గిన్నెపై మూత ఉంచడం వల్ల ఆవిరి బయటకు పోకుండా ఆహారం వేగంగా ఉడుకుతుంది.

4. ముందే ప్రణాళిక వేసుకోండి: వంట మొదలు పెట్టే ముందే కూరగాయలు కోయడం, పప్పులు నానబెట్టడం వంటివి పూర్తి చేయాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇవి చేస్తే అనవసరంగా గ్యాస్ వృధా అవుతుంది.

5. అవసరమైనంతే వేడి చేయండి: శీతాకాలంలో పాలు లేదా నీటిని మాటిమాటికీ వేడి చేయడం కంటే, ఒకేసారి వేడి చేసి ఫ్లాస్క్‌లో ఉంచుకోవడం మంచిది. దీనివల్ల ప్రతిసారీ గ్యాస్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు.

గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే, దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఇంటర్నెట్ నివేదికల ఆధారంగా ఈ చిట్కాలు అందించబడ్డాయి.