
మీరు తరచూ చిరుతిళ్లు తినే అలవాటు ఉందా? రోజుకు రెండుసార్లు సరిగ్గా బ్రష్ చేసినా మీ దంత ఆరోగ్యం ప్రమాదంలో ఉంటుంది. రోజంతా ఏదో ఒకటి నమలడం అనేక సమస్యలు తెస్తుంది. కాబట్టి ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ఎస్తటిక్ డెంటిస్ట్రీ నిపుణురాలు, డాక్టర్ నికితా మోత్వాణి అభిప్రాయాలు తెలుసుకుందాం.
డాక్టర్ మోత్వాణి ఈ విధంగా వివరించారు: చక్కెర లేదా స్టార్చ్ ఎక్కువ ఉన్న ఆహారం లేదా పానీయం తీసుకున్నప్పుడు, నోటిలోని బ్యాక్టీరియా వాటిని ఆమ్లాలుగా మారుస్తుంది. ఈ ఆమ్లం దంతాల ఎనామిల్‌పై హాని కలిగిస్తుంది. నోటిలోని pH స్థాయి తగ్గుతుంది. దీనినే ‘ఆమ్ల దాడి’ (Acid Attack) అంటారు. మీరు ఏదైనా తిన్నా, తాగినా ఇది 20 నుంచి 30 నిమిషాలు ఉంటుంది.
బ్రష్ చేస్తే పళ్లు సురక్షితం అనుకోవద్దు. మీరు ప్రతిసారి తిన్నప్పుడు, మీ నోరు ఆమ్ల దాడిని ఎదుర్కొంటుంది. ఎంత చక్కెర ఉంది అనే దానికంటే, ఎన్నిసార్లు చిరుతిళ్లు తింటున్నారు (Frequency) అనేదే దంతక్షయానికి ఎక్కువ బాధ్యత వహిస్తుంది.
చాలా మంది బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్, కాఫీ వంటివి రోజంతా మాటిమాటికీ తింటారు. దీనిని గ్రేజింగ్ లైఫ్‌స్టైల్ అంటారు. దీనివల్ల దంతాలకు విశ్రాంతి దొరకదు. నిరంతరం స్నాకింగ్ చేయడం వల్ల నోరు ఎక్కువ గంటలు ఆమ్ల స్థితిలోనే ఉంటుంది. ఫలితంగా లాలాజలం (Saliva) ఎనామిల్‌ను రిపేర్ చేసే అవకాశం ఉండదు. పళ్లలో పురుగులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దంతాలు తిరిగి కోలుకోవడానికి ఎక్కువ సమయం ఇచ్చేలా ఒక షెడ్యూల్ ప్రకారం మాత్రమే ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు.
ఈ స్నాక్స్ దంతాల మధ్య ఇరుక్కుంటాయి. ఇది దంతక్షయానికి అనువైన వాతావరణం సృష్టిస్తుంది:
జిగురు డ్రై ఫ్రూట్స్: ఎండుద్రాక్ష, ఖర్జూరం, అత్తి పళ్లు (Figs), అంజీర్ రోల్స్, ఎనర్జీ బార్స్ వంటివి దంతాల మధ్య ఇరుక్కుని ఎక్కువ గంటలు అలాగే ఉంటాయి.
ఇండియన్ నమ్‌కీన్, చిప్స్: పిండి పదార్థాలు (Carbs) చక్కెరగా మారుతాయి. చిన్న ముక్కలు పంటి లోపల ఇరుక్కుంటాయి.
గ్రాన్యులా/ఎనర్జీ బార్స్: వీటిలో ఎక్కువగా చక్కెరలు, తేనె లేదా సిరప్ ఉంటాయి.
పండ్ల రసాలు/స్మూతీలు/కొబ్బరి నీళ్లు: వీటిలో పండు నుంచి వచ్చే చక్కెర, ఆమ్లం చాలా ఎక్కువ.
మసాలా చాయ్/కోల్డ్ కాఫీ: చక్కెర వేసి గంటపాటు చాయ్ లేదా కాఫీ తాగితే, అది 4 నుంచి 5 సార్లు ఆమ్ల దాడికి కారణమవుతుంది.
గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. వైద్యపరమైన సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు. దంత సమస్యలపై ఎప్పుడైనా మీ వైద్యుడిని సంప్రదించండి.