నేటి బిజీ లైఫ్‌లో మనలో చాలా మంది ఆహారం త్వర త్వరగా తింటారు.. దాని వల్ల ఆహారాన్ని సరిగ్గా నమలడం (నిమిలి తినే) అలవాటును కోల్పోతాము. ఈ అలవాటు సామాన్యమైనదిగా అనిపించవచ్చు.. కానీ ఇది మన జీర్ణక్రియ.. మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆహారాన్ని సరిగ్గా నమలడం కేవలం చిన్న ముక్కలుగా విడగొట్టడానికే పరిమితం కాదు.. ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ముఖ్యమైనదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ ప్రక్రియ మన నోటి నుంచి ప్రారంభమవుతుంది. మనం ఆహారాన్ని నమిలినప్పుడు, అది చిన్న ముక్కలుగా మారిపోతుంది.. ఇది కడుపు, ప్రేగులకు సులభంగా చేరి జీర్ణమవుతుంది. అదనంగా, మన లాలాజలంలో ఉండే ఎంజైమ్‌లు ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తాయి. అయితే.. ఆహారాన్ని సరైన విధంగా నమిలి తినకపోతే.. అది పెను ప్రమాదంగా మారుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
సరైన విధంగా ఆహారాన్ని నమిలి తినకపోతే.. ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకోండి..
గ్యాస్ – కడుపు ఉబ్బరం: పెద్ద ఆహార కణాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.. ఇది ప్రేగులలో గ్యాస్, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
గుండెల్లో మంట: ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే, కడుపు ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటుంది.. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తుంది.
బరువు – సంతృప్తిపై ప్రభావం: త్వరగా తినడం ద్వారా, మన మెదడు ఆకలి, సంతృప్తికి సంబంధించిన సరైన సంకేతాలను ఇవ్వదు. నెమ్మదిగా, పూర్తిగా నమలడం వల్ల సంతృప్తికరమైన హార్మోన్లను సక్రియం చేస్తుంది.. ఇది ఆకలిని తగ్గిస్తుంది.. అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. ఈ అలవాటు బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
2023లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. నమలడం అనేది జీర్ణక్రియకు మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా సంబంధించినదని పేర్కొంది.. ఇది శరీర మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
పోషకాల శోషణ: ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే, శరీరం ఆహారం నుంచి అన్ని పోషకాలను పొందదు.
నోటి ఆరోగ్యం: సరిగ్గా నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది దంతాలు, చిగుళ్లను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ప్రతి ఆహారాన్ని మనం తింటున్నప్పుడు.. నోటిలో ఉంచగానే 25 నుంచి 40 సార్లు నమలడం అలవాటు చేసుకోండి. అంటే పదార్థాన్ని బట్టి అలవాటు చేసుకోవడం మంచిది. సులభమైన ఆహారం అయితే.. తక్కువ సమయంలోనే నమలవచ్చు.. అదే.. మంసాహారం అయితే.. చాలా సేపు నమిలి తినడం మంచిది..
ఎక్కువగా కాకుండా.. చిన్న చిన్న పరిణామంలో ఆహారాన్ని తినండి.. భోజనం – భోజనానికి మధ్య విశ్రాంతి తీసుకోండి.
నీరు త్రాగడం అలవాటు చేసుకోండి.. కానీ, పెద్ద పెద్ద పదార్థాలను నోటిలోనుంచి త్వరగా మింగడానికి ఉపయోగించవద్దు.
నిదానంగా – సరిగ్గా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా దీర్ఘకాలంలో మెరుగైన ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి