Ugadi Pachadi: జీవితానికి అర్ధం చెప్పే ఉగాది పచ్చడిలో ఆరోగ్య ప్రయోజనాలు? తయారీ విధానం మీ కోసం
ఉగాది పండగ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వేప పువ్వుతో చేసే పచ్చడి. ఆరు రుచులు కలిపి తయారు చేసే పచ్చడి. వసంతం రాకకి స్వాగతం పలుకుతూ ఈ సీజన్ లో దొరికే వేప పువ్వు, మామిడి పిందే, కొత్త చింత పండు, కారం, కొత్త బెల్లం, ఉప్పు లతో కలిపి చేసే పచ్చడిని ఉగాది పచ్చడి అని అంటారు. ఈ సీజన్ లో తయారు చేసే ఉగాది పచ్చడి వెనుక శాస్త్రీయ కోణం ఉంది. ఈ రోజు ఉగాది పచ్చడి తయారీ విధానం.. ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

హిందువులు జరుపుకునే పండుగలు, ఆచారాలు సంప్రదాయాల వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంది. సృష్టి మొదలైన రోజుని యుగాది గా కాలక్రమంలో ఉగాది పండగ గా జరుపుకుంటున్నారు. ఈ ఉగాది పండుగ ప్రకృతి పండుగ. ఈ రోజున ఆరు రుచులతో తయారు చేసే ఉగాది పండగ వెనుక ఆరోగ్య రహస్యం ఉంది. ఈ ఉగాది పచ్చడి తినడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఈ సంవత్సరమంతా జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించడమే… ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేపపువ్వుతో చేసే ఉగాది పచ్చడి. ఆరు రుచుల కలయికతో ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలి? ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
ఉగాది పచ్చడిలో ఆరు రుచులు అంటే చేదు కోసం వేప పువ్వులు, తీపి చెఱుకు రసము లేదా చిన్న చిన్న గా తరిగిన చెఱుకు ముక్కలు, బెల్లం, పులుపు కోసం చింతపండు రసము, మామిడి కాయ ముక్కలు. కారం.. ఒక పచ్చి మిరపకాయ చాలా సన్నగా తరిగి వేస్తారు. ఉప్పు.. ఈ ఆరుచులు ఉంటాయి.
ఉగాది పచ్చడి తయారీకి కావాల్సిన పదార్ధాలు
- వేప పువ్వు – ఒక కప్పు ( పువ్వులు వలుచుకుని చేతితో పైపైన కొద్దిగా నలుపు కోవాలి).
- చింతపండు – రసం
- మామిడి కాయ – ఒకటి
- చెఱుకు – చిన్న చిన్న ముక్కలు
- పచ్చి కొబ్బరి – అర చిప్ప
- బెల్లం – పొడి
- ఉప్పు – తగినంత
- అరటి పండు- చక్కర కేళి ఒకటి
- కిస్ మిస్ – ఒక కప్పు .
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని చెరకు రసం, చింతపండు రసం వేసుకుని అందులో నలిపిన వేప పువ్వులు, తరిగిన మామిడి కాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, కట్ చేసిన అరటి పండు ముక్కలు, తరిగిన కిస్ మిస్, బెల్లం పొడి, రుచికి సరిపగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఉగాది పచ్చడి రెడీ. ఈ ఉగాది పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజ చేసి అనంతరం కుటుంబ సభ్యులంతా ఉగాది పచ్చడి స్వీకరించాలి.
పచ్చడి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- వేప పువ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని ఆయుర్వద శాస్త్రంలో ఔషధ మూలికలుగా పేర్కొన్నారు. చర్మ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, మధుమేహం, మలేరియా మొదలైన వాటికి దివ్యౌషధంగా పని చేస్తుంది. వేపను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- ఈ సీజన్ లో దొరికే మామిడిని తినడం వలన రక్తనాళాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పచ్చి మామిడిని తినడం వలన గ్యాస్ట్రిక్, హార్ట్ బర్న్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
- బెల్లం తినడం వలన కాలేయం శుభ్రపడుతుంది. టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. బెల్లంలో జింక్, సెలీనియం అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
- చింతపండు జీర్ణ శక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది.
- అంతేకాదు ఈ ఉగాది పచ్చడి తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)