ఈ వస్తువులు ఉంటే చాలు.. ఇంట్లోనే హైదరాబాద్ స్పెషల్ ధమ్ బిర్యానీ.. క్షణాల్లో చెయొచ్చు..
రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ చికెన్ బిర్యానీని తయారుచేసి తింటే.. ఆ కిక్కే వేరప్ప.. బిర్యానీ మసాలా పొడి తయారీ నుండి చికెన్ మ్యారినేషన్, ఆనియన్స్ ఫ్రైయింగ్, రైస్ తయారీ, దమ్ చేసే ప్రక్రియ వరకు ప్రతి దశను ఈ కథనంలో వివరంగా తెలుసుకోవచ్చు. ఇంట్లో రుచికరమైన బిర్యానీని తయారుచేయడానికి అవసరమైన చిట్కాలు, పద్ధతులు ఇందులో అందిస్తున్నాం.. తెలుసుకోండి..

హైదరాబాద్ చికెన్ బిర్యానీ అంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. వాస్తవానికి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అనగానే నోరూరించే సువాసన, మసాలా దట్టించిన జ్యుసీ చికెన్ ముక్కలు.. పొడిపొడిలాడే బాస్మతి బియ్యం గుర్తొస్తాయి. అయితే.. హైదరాబాద్ చికెన్ బిర్యానీని ఇంట్లో సులువుగా తయారు చేసుకోవచ్చు.. రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ చికెన్ బిర్యానీని ఇంట్లో సులభంగా తయారుచేయడం ఎలానో ఈ కథనంలో తెలుసుకుందాం..
రుచికరమైన హైదరాబాద్ చికెన్ బిర్యానీ వంటకాన్ని సిద్ధం చేయడానికి కొన్ని ముఖ్యమైన దశలు – చిట్కాలు..
మొదటగా, బిర్యానీకి అవసరమైన మసాలా పొడిని తయారుచేయాలి. అనాసపువ్వు, దాల్చిన చెక్క, యాలుకలు, బిర్యానీ ఆకు, జాజిపత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలను మిక్సీలో వేసి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా బిర్యానీకి ప్రత్యేకమైన సువాసనను ఇస్తుంది.
తరువాత, 1 కిలో చికెన్‌ను సిద్ధం చేసుకోవాలి. చికెన్‌ను కర్రీ పీసుల కంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోవడం వల్ల బిర్యానీలో చక్కగా ఉడుకుతుంది. శుభ్రంగా కడిగిన చికెన్ పీసులకు తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల కారం, ముందుగా తయారుచేసిన బిర్యానీ మసాలా పొడి, రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక కప్పు పెరుగు (సుమారు 100 ml), అర కప్పు నూనె (సుమారు 50 ml) కలిపి బాగా పట్టించాలి. ఈ మిశ్రమాన్ని కనీసం రెండు గంటలు లేదా రాత్రంతా మ్యారినేట్ చేయడం వలన చికెన్ మృదువుగా, రుచికరంగా మారుతుంది.
బిర్యానీకి అవసరమైన వేయించిన ఉల్లిపాయల కోసం, మూడు మీడియం సైజు ఉల్లిపాయలను స్లైసులుగా కట్ చేసి, ఐదు టేబుల్ స్పూన్ల నూనెలో గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఇవి బిర్యానీకి మంచి రుచిని, సువాసనను అందిస్తాయి. అలాగే, ఒక చిన్న కట్ట కొత్తిమీర, చిన్న కట్ట పుదీనా, మూడు పచ్చిమిర్చిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీలో ఆకులను కనిపించకుండా చేస్తుంది.
బియ్యాన్ని సిద్ధం చేయడానికి, 1 కిలో చికెన్‌కు సుమారు 750 గ్రాముల బాస్మతి బియ్యాన్ని రెండుసార్లు కడిగి, సరిపడా నీటిలో ఒక గంటపాటు నానబెట్టాలి. నానబెట్టడం వల్ల బియ్యం త్వరగా ఉడికి, పొడవుగా వస్తాయి.
బిర్యానీని దమ్ చేయడానికి, లోతైన కడాయిలో మ్యారినేట్ చేసిన చికెన్ పీసులను ఒక పొరగా పరచాలి. దానిపై కొత్తిమీర-పుదీనా-పచ్చిమిర్చి పేస్ట్, కొన్ని వేయించిన ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ రసం పిండాలి.
ఇప్పుడు, బియ్యాన్ని ఉడికించాలి. ఒక లీటరు నీటిని స్టవ్ మీద పెట్టి, అందులో రెండు బిర్యానీ ఆకులు, అర టీ స్పూన్ షాజీరా, ఉల్లిపాయలు వేయగా మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు వేయాలి. నీరు బాగా మరిగిన తర్వాత, నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని నీరు తీసివేసి కలపాలి. బియ్యం 70% ఉడికేంతవరకు (చేతితో నొక్కితే రెండు ముక్కలయ్యేంతవరకు) ఉడికించి, వెంటనే చిల్లుల గిన్నెలోకి మార్చి వేడి నీటిని తీసేయాలి.
ఉడికించిన బియ్యాన్ని చికెన్ పైన ఒక పొరగా వేయాలి. దానిపై కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మిగిలిన వేయించిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ (లేదా కుంకుమపువ్వు కలిపిన పాలు) చల్లాలి.
చివరగా, కడాయి అంచులను గోధుమపిండి లేదా మైదాపిండితో సీల్ చేసి, మూత గట్టిగా ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి, ఐదు నిమిషాలు హై ఫ్లేమ్‌లో, ఆపై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. తరువాత, కడాయిని తవాపై ఉంచి, ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్‌లో దమ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, బిర్యానీని పది నిమిషాల పాటు కదపకుండా ఉంచాలి. ఇది బిర్యానీలోని తేమను పూర్తిగా ఆవిరి చేయడానికి సహాయపడుతుంది. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సువాసనభరితమైన హైదరాబాదీ చికెన్ బిర్యానీ సిద్ధంగా ఉంటుంది. ఈ పద్ధతిలో తయారుచేసిన బిర్యానీ రెస్టారెంట్ రుచిని ఇస్తుంది, చికెన్ జ్యూసీగా ఉండి మసాలా ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టేస్టీ హైదరాబాద్ చికెన్ బిర్యానీని తయారు చేసుకోండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
