జెన్‌జీల థింకింగ్ మారింది.. కానీ అదొక్కటే మారలేదు.. డైలీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలో తెలుసా..?
జెన్‌జీ తరంలో ప్రోటీన్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రొటీన్ పౌడర్లు, స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉత్పత్తులతో పాటు పప్పులు, సోయా, గింజలు, మాంసాహారం వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్‌ను యువత తమ డైట్‌లో చేర్చుకుంటున్నారు. అయితే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటేనే కండరాలు పెరుగుతాయా? ప్రోటీన్ వల్ల కిడ్నీలు దెబ్బతింటాయా? మాంసాహారంలోనే ప్రోటీన్ ఉంటుందా? వంటి ఎన్నో అపోహలు ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఏం తినాలి, వెయిట్ లాస్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అనే విషయాలపై దృష్టిసారిస్తున్నారు. అంతేకాకుండా.. శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా పనిచేయడానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలపై దృష్టిసారిస్తున్నారు. అయితే.. గతంతో పోలిస్తే జెన్‌జీ తరం ఆరోగ్యంపై దృష్టిసారించింది. ఇటీవలి సంవత్సరాలలో జెనరేషన్ Z వారిలో ప్రొటీన్ పౌడర్, ఇతర క్రీడా పోషకాహార ఉత్పత్తుల డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. జెన్ Z కి ప్రోటీన్ పట్ల వ్యామోహం పెరగడానికి.. సోషల్ మీడియా వెల్నెస్ సంస్కృతి, నివారణ ఆరోగ్యం, దీర్ఘాయువు వైపు మళ్లడం, ఫంక్షనల్ ఫుడ్స్ వంటి వాటిపై దృష్టిసారిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
మారుతున్న జెన్‌జీ ఆలోచన..
కేవలం సాంప్రదాయ బాడీబిల్డింగ్ ఫలితాల కోసం పాకులాడకుండా, యువత అధిక ప్రోటీన్ ఆహారాలను శక్తి, మానసిక ఏకాగ్రత, రోజువారీ శ్రేయస్సు కోసం ఒక జీవనశైలి సూచికగా చూస్తున్నట్లు పేర్కొంటున్నారు. GEN-Z శారీరక, మానసిక వికాసానికి తోడ్పడే విటమిన్లు, స్థూల, సూక్ష్మ పోషకాలను తగినంతగా తీసుకోవడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు. అయితే, ప్రోటీన్ విషయంలో మార్కెట్ లో లభించే పదార్థాలను ఏది పడితే అవి తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక ప్రోటీన్ ఆహారంపై సమాజంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయని.. అయితే శారీరక అవసరాలను తగినట్లు ప్రోటీన్ పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అధిక ప్రోటీన్ డైట్ల విషయంలో చాలా గందరగోళం నెలకొందని.. సరైన అవగాహనతోనే వీటిని పరిష్కరించవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. సోషల్ మీడియా ప్రచారం ద్వారా ఎలా పడితే అలా తీసుకోకుండా శారీరక అవసరాలను గుర్తించాలని సూచిస్తున్నారు.
ప్రోటీన్ గురించి చాలా అపోహలు..
ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటేనే కండరాలు పెరుగుతాయని, మాంసాహారం వల్లే ప్రొటీన్ వస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ శాకాహారంలో కూడా ప్రోటీన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం ప్రోటీన్లు ఎక్కువగా తీసుకుంటే కండరాలు పెరగవు, సరైన వ్యాయామం కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు. మాంసాహారంతోపాటు.. పప్పులు, సోయా, గింజలు వంటి శాకాహారంలో కూడా ప్రోటీన్ ఉంటుంది.
ప్రోటీన్ అవసరాలు.. ఎంత తీసుకోవాలి..
ప్రోటీన్ మోతాదు వ్యక్తి వయస్సు, శారీరక శ్రమ, ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజువారీగా ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఉదాహరణకు 60 కిలోల బరువున్న వారు రోజుకు సుమారు 48 నుండి 55 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే.. ప్రోటీన్ లోపం వల్ల కండరాలు బలహీనపడటం, అలసట, జుట్టు రాలడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు..
అందుకే.. ఎలా పడితే అలా ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకోకుండా.. ఆరోగ్య నిపుణులు సూచించిన విధంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే.. నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
