పోషకాల గని మటన్ లివర్ సెట్ గురించి మీకు తెలుసా..? ఈ పార్ట్స్‌తో ఆ రోగాల మాటే ఉండదు..
మటన్ లివర్ సెట్ అనేది మేక కాలేయం (లివర్), తిల్లి, గుండె, లంగ్స్, కొన్నిచోట్ల కిడ్నీ, స్వరపేటిక వంటి అవయవాల సమాహారం. ఐరన్, విటమిన్-A, విటమిన్ B12, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో దీన్ని పోషకాల గనిగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రక్తహీనత తగ్గించడంలో, రోగనిరోధక శక్తి పెంపొందించడంలో, శరీరానికి శక్తిని అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

నాన్ వెజ్ ప్రియులు మటన్ (మేక మాంసం) ను ఇష్టంగా తింటారు.. ఇందులో ప్రోటీన్ తోపాటు బీ12 ఇంకా ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అయితే.. మేకలోని అన్ని పార్ట్స్‌లో కూడా శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి.. మటన్ మాంసంతోపాటు.. లివర్, తిల్లి, గుండె, పాయ, తలకాయ, లంగ్స్, బోటీ ఇవన్నీ ప్రత్యేకమైనవే.. అయితే.. వీటన్నింటి గురించి తెలుసు కానీ.. మటన్ లివర్ సెట్ గురించి తెలుసా..? ఇది పోషకాల గని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మటన్ లివర్ సెట్ లో లివర్ తోపాటు.. తిల్లి, లంగ్స్, గుండె, స్వరపేటిక ఉంటాయి.. వాస్తవానికి మటన్ లివర్ (కాలేయం), తిల్లి (మేక ప్లీహం/నెరడు), లంగ్స్, గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఐరన్, విటమిన్-A, విటమిన్ B12, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని సాధారణంగా మటన్ పీసెస్ తో పాటు విడిగా లివర్ సెట్.. అంటే లివర్, కిడ్నీ, గుండె కలిపి అమ్ముతారు. ఈ అత్యంత పోషకమైన అవయవ మాంసాలు రక్తహీనతను తగ్గించి, శరీరంలో రక్తాన్ని, శక్తిని పెంచడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.. మటన్ లివర్ సెట్ ను ఫ్రై, లేదా కర్రీ రూపంలో వండుకోని తినవచ్చు.. ఇది అద్భుతంగా ఉండటంతోపాటు.. ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.
మటన్ లివర్ – తిల్లీ ఫ్రై రెసిపీ.. సులభమైన, రుచికరమైన తయారీ విధానం..
మటన్ లివర్, తిల్లీ, లంగ్స్, గుండె ఫ్రై వంటకం చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని తయారుచేయడం చాలా సులువు. మాంసాహారం ప్రియులకు ఈ వంటకం ఒక చక్కటి ఎంపిక. దీనికి అవసరమైన పదార్థాలు సులభంగా లభిస్తాయి. ఇంట్లో సులభంగానే దీన్ని తయారుచేసుకోవచ్చు.
దీని తయారీకి ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి. ఇవి వేగిన తర్వాత, మటన్ లివర్, తిల్లి, గుండె, లంగ్స్ మిశ్రమాన్ని వేసి బాగా వేయించాలి. ఆ తరువాత, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, రెండు టీస్పూన్ల కారం, పావు టీస్పూన్ పసుపు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత అర టీస్పూన్ గరం మసాలా, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి వేయించాలి. నీళ్లు వేయడం వల్ల ఫ్రై మరీ పొడిగా మారకుండా రుచిగా ఉంటుంది. మధ్యస్థ మంటపై ఐదు నుండి ఆరు నిమిషాలు వేయించిన తర్వాత, నీరు ఆరిపోయి ఫ్రై డ్రైగా మారుతుంది.
ఈ మటన్ లివర్, తిల్లీ ఫ్రైని వేడి వేడి అన్నంతో కలుపుకుని తినవచ్చు లేదా సాయంత్రం వేళల్లో స్నాక్స్‌గా విడిగా కూడా తినవచ్చు. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని ఒకసారి ప్రయత్నించి చూస్తే, దీని రుచి మీకు తప్పకుండా నచ్చుతుంది.
అయితే, అవయవ మాంసాల్లో కొలెస్ట్రాల్, విటమిన్-A అధికంగా ఉండే అవకాశం ఉన్నందున మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
