
గుజరాత్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకం మెంతి ముఠియా (మెంతి పకోడి) ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. శీతాకాలంలో లభించే తాజా మెంతికూరతో చేసే ఈ స్నాక్ రుచికరంగా ఉండటమే కాకుండా, తక్కువ నూనెను పీల్చుకుంటుంది. సాయంత్రపు తేనీటి వేళకు ఇది అద్భుతమైన ఎంపిక.. ఇంకా మెంతికూర ప్రయోజనాలు సైతం లభిస్తాయి.. ఈ రుచికరమైన కరకరలాడే.. స్నాక్ తో పొట్ట ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముందుగా 200 గ్రాముల మెంతికూర ఆకులను వీలైనంత సన్నగా తరగాలి. ఆ తర్వాత అల్లం (ఒకటిన్నర అంగుళం ముక్క), 12-15 వెల్లుల్లి రెబ్బలు, 3-4 పచ్చిమిర్చి (కారంగా ఉండేవి), రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకుని రోట్లో లేదా మిక్సర్ జార్‌లో కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ముఠియాలకు కారం ప్రధానంగా అల్లం, పచ్చిమిర్చి నుండే వస్తుంది.
ఒక వెడల్పాటి గిన్నెలో తరిగిన మెంతికూర ఆకులు తీసుకోవాలి. దీనిలో 1/3 కప్పు రవ్వగా ఉండే గోధుమపిండి, ఒక కప్పు శనగపిండి వేయాలి. గుజరాతీలు బరకగా ఉండే గోధుమపిండిని వాడుతారు. అది అందుబాటులో లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కలుపుకోవచ్చు. ఇంకా అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ల పంచదార (రుచులను సమన్వయం చేస్తుంది, నచ్చని వారు విడిచిపెట్టవచ్చు), చిన్న పిడికెడు కొత్తిమీర తరుగు, పావు టీ స్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని మెంతికూరను మెత్తగా నిమురుతూ కలపాలి, అప్పుడు ఆకులోని సారం విడుదలై పొడి పిండి తడుస్తుంది. పిండిని సరిగ్గా కలపకుండా ముందుగానే నీళ్లు కలిపితే పిండి జారైపోతుంది…
పిండిని బాగా మర్దించుకున్న తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం-పచ్చిమిర్చి ముద్దను వేసి కలుపుకోవాలి. ఆపై కొద్దికొద్దిగా నీటిని కలుపుతూ, చపాతీ పిండిలా సెమీ-స్టిఫ్ గా కలుపుకోవాలి. ఈ పిండి మృదువుగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ పిండితో చేసే రోటీలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. చివరగా, రెండు చిటికెళ్ల వంట సోడా, అర చెక్క నిమ్మరసం సోడాపై పిండితే అది పొంగుతుంది. ఆ తర్వాత పిండిని బాగా కలిపేయాలి. సోడా కలపడం వల్ల ముఠియాలు మెత్తగా, గుల్లగా వస్తాయి.. లేదంటే కాస్త గట్టిగా ఉండవచ్చు.
తరువాత చేతికి నూనె రాసుకుని, పిండిని చిన్న ఉసిరికాయంత పరిమాణంలో లేదా బుల్లెట్స్ ఆకృతిలో చేసుకోవాలి. తయారు చేసుకున్న ఈ ముఠియాలను మరిగే నూనెలో మీడియం మంటపై ఎర్రగా మారే వరకు వేయించుకోవాలి. ఈ ముఠియాలకు సహజంగా కొద్దిగా చేదు ఉంటుంది. చేదు ఇష్టం లేని వారు మెంతికూరలో సగం పాలకూర లేదా కొయ్యతోటకూర కలుపుకోవచ్చు. అయితే, పూర్తి మెంతికూరతోనే అసలైన గుజరాతీ రుచి వస్తుందని గుర్తుంచుకోవాలి. వేయించేటప్పుడు బుడగలు తగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కొత్తిమీర పచ్చడి లేదా టమాటో సాస్ తో వేడివేడిగా అందిస్తే చాలా రుచికరంగా ఉంటాయి. గుజరాతీలు ఈ ముఠియాలతో ఇతర కూరగాయలు చేర్చి అనేక వంటకాలు కూడా చేస్తారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..