మొలకలను పచ్చిగా తింటున్నారా? ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువంటున్న నిపుణులు

మొలకలు పోషకాల గని అనడంలో సందేహం లేదు. కానీ, వాటిని ఎలా తింటున్నామనేది ముఖ్యం. పచ్చి మొలకల వల్ల కలిగే బ్యాక్టీరియా ముప్పు, జీర్ణ సమస్యల గురించి అవగాహన పెంచుకోవడం అవసరం. మొలకలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, కానీ వాటిని తీసుకునే పద్ధతి సరిగ్గా ఉండాలి. పచ్చిగా తినడం మానేసి, కొద్దిగా ఉడికించి తీసుకోవడం వల్ల రుచితో పాటు పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

మొలకలను పచ్చిగా తింటున్నారా? ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువంటున్న నిపుణులు
Sprouts Health Facts.jpg

Updated on: Mar 21, 2026 | 7:10 AM

మొలకెత్తిన విత్తనాలు అనగానే మనకు గుర్తొచ్చేది అత్యంత పోషక విలువలున్న ఆహారం. బరువు తగ్గాలనుకునే వారు, కండరాలు పెంచాలనుకునే వారు తమ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తప్పనిసరిగా చేర్చుకుంటారు. అయితే, మొలకలను పచ్చిగా తినడమే ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ, ప్రముఖ పోషకాహార నిపుణురాలు లీమా మహాజన్ ప్రకారం.. ప్రతిరోజూ మొలకలను పచ్చిగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. మొలకల విషయంలో మనం చేసే పొరపాట్లు, పాటించాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..

  • మొలకలు పెరగడానికి తేమ, వెచ్చని వాతావరణం అవసరం. ఇదే వాతావరణం ఈ-కోలై, సాల్మొనెల్లా వంటి ప్రమాదకర బ్యాక్టీరియా పెరగడానికి కూడా అనుకూలం. కేవలం నీటితో కడగడం వల్ల ఈ బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోదు. అందుకే మొలకలను పచ్చిగా తినడం కంటే.. కొద్దిగా ఆవిరిపై ఉడికించడం లేదా దోరగా వేయించడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.
  • చాలామంది మొలకలను ప్రధాన ప్రోటీన్ వనరుగా భావిస్తారు. కానీ, 100 గ్రాముల మొలకల్లో కేవలం 3-4 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. శరీరానికి కావలసిన పూర్తి ప్రోటీన్ అందాలంటే మొలకలతో పాటు పనీర్, గుడ్లు, పప్పు ధాన్యాలు, సోయా వంటివి కూడా డైట్‌లో ఉండాలి. మొలకలు కేవలం ఒక సపోర్టింగ్ ఫుడ్ మాత్రమే, మెయిన్ ప్రోటీన్ సోర్స్ కాదు.
  • పచ్చి మొలకల్లో ఫైబర్ మరియు ఫెర్మెంటబుల్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడం కొంచెం కష్టం. ముఖ్యంగా ఐబిఎస్ (IBS) లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు అసౌకర్యానికి దారితీస్తాయి. ఉడికించి తినడం వల్ల ఇవి సులభంగా జీర్ణమవుతాయి.
  • మొలకలను ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే నిల్వ చేయాలి. అయితే, ఫ్రిజ్‌లో పెట్టినంత మాత్రాన బ్యాక్టీరియా పూర్తిగా నశించదు, కేవలం వృద్ధి చెందడం మందగిస్తుంది. అందుకే మొలకలను తయారు చేసిన 24 నుండి 48 గంటల లోపు వాడేయడం ఉత్తమం. అంతకంటే ఎక్కువ రోజులు ఉంచితే అవి విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది.
Follow Us