
పల్లి పట్టి (Peanut Chikki) వేరుశెనగలు, బెల్లం పాకంతో చేసే సాంప్రదాయక ఆరోగ్యకరమైన తీపి వంటకం.. ఇది రుచికరంగా ఉండటంతోపాటు.. దీనిలోని పోషకాలు తక్షణ శక్తిని ఇస్తాయి.. అంతేకాకుండా పలు సమస్యలను నివారిస్తాయి.. వాస్తవానికి భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా బెల్లం, వేరుశనగ పప్పుల కలయికకు ప్రత్యేక స్థానం ఉంది. పెద్దలు ఈ రెండింటిని కలిపి తీసుకోవాలని తరచుగా సూచిస్తుంటారు. దీని వెనుక కేవలం రుచి మాత్రమే కాకుండా, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చిక్కీలు, లడ్డూలు, ఉండలు వంటి వివిధ రూపాలలో లభించే ఈ ఆహార సమ్మేళనం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వేరుశనగ పప్పును పేదవాడి జీడిపప్పు అని పిలుస్తారు. ఎందుకంటే ఇది జీడిపప్పు వలె ఖరీదైనది కానప్పటికీ, పోషకాల పరంగా దానికి ఏమాత్రం తీసిపోదు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. బెల్లం కూడా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు అనేక విటమిన్లను కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల వాటి పోషక విలువలు మరింత పెరుగుతాయి.
ప్రధానంగా, పల్లి బెల్లం కాంబినేషన్ రక్త వృద్ధికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లంలో ఉండే ఐరన్, పల్లీలలోని పోషకాలతో కలిసి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచి, తద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు కూడా వీటిని నిత్యం తీసుకోవడం మంచిది.
ఈ సమ్మేళనంలో లభించే అధిక ప్రోటీన్లు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువ చేసేవారు, నీరసంగా ఉన్నవారు, పిల్లలు, గర్భిణులు రోజుకు రెండు మూడు పల్లి బెల్లం ఉత్పత్తులను తీసుకోవడం వల్ల చురుకుగా, బలంగా ఉంటారు. గర్భిణులకు, పొట్టలోని శిశువు ఎదుగుదలకు ఈ ఆహారం చాలా మంచిది. పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
పల్లి బెల్లం రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఇది కాలానుగుణంగా వచ్చే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఒక ఔషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజు వీటిని తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుందని, స్థూలకాయ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని చెబుతారు. అయితే స్థూలకాయం ఉన్నవారు మితంగా తీసుకోవడం శ్రేయస్కరం.
ఈ పల్లి బెల్లం కాంబినేషన్, దానిలోని పోషకాల కారణంగా, ఉక్కు లాంటి దృఢమైన కండలు, శక్తిని కోరుకునే వారికి ప్రతిరోజు తీసుకోవాల్సిన ఆహారంగా పరిగణించవచ్చు. రోజు గుప్పెడు పల్లీలు గుండెను పదిలంగా ఉంచితే, వాటితో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల గుండెకు మరింత రక్షణ లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి, శక్తికి ఈ సంప్రదాయ ఆహారం ఒక సహజసిద్ధమైన, పోషక విలువలు గల ఎంపిక.
కావలసిన పదార్థాలు: సరిపోయేంతగా తీసుకోవాలి..
వేరుశెనగలు (పల్లీలు)
బెల్లం (తురిమినది)
నెయ్యి
పల్లీలను తక్కువ మంటపై దోరగా వేయించి, పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
బెల్లం పాకం పట్టడం: గిన్నెలో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం పాకం ముదురు పాకం అంటే.. నీళ్లలో వేస్తే గాజులా విరగాలి వచ్చే వరకు ఉడికించాలి.
పాకంలో వేయించిన పల్లీలు వేసి బాగా కలిపి, వెంటనే నెయ్యి రాసిన ప్లేట్‌లోకి మార్చాలి.
వేడిగా ఉన్నప్పుడే చపాతీ కర్రతో ఒత్తి, నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.
అయితే.. పాకం సరిగ్గా రాకపోతే పట్టి జిగటగా ఉంటుంది. కావున పాకం ముఖ్యం..
చల్లారిన తర్వాత గాలిచొరబడని డబ్బాలో నిల్వ ఉంచితే.. తాజాగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..