
మటన్ కర్రీ ఎక్కువగా తిని కడుపు బరువుగా అనిపిస్తుందా..? అయితే వేడి వేడి మటన్ పాయా సూప్ తాగండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. ఇంట్లోనే ఈ రుచికరమైన సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలా మందికి ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. శారీరక శ్రమ తక్కువగా ఉండటం, ఎక్కువగా తినడం, ప్యాక్ చేసిన ఆహారాలు తినడం వల్ల మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. అందుకే పేగులను శుభ్రం చేయడం, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.
మన పేగుల్లో లక్షల కోట్ల సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా) ఉంటాయి. ఇవే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి శక్తిని ఇస్తాయి. పాయా సూప్ లాంటి ఆరోగ్యకరమైన సూప్‌లు తాగడం వల్ల ఈ సూక్ష్మజీవులు సమతుల్యంగా ఉండి బాగా పని చేస్తాయి.
నిపుణులు చెప్పినదాని ప్రకారం.. శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి పోషకాలు ఉన్న సూప్‌లు తాగాలి. నాన్ వెజ్ తినే వారికి మటన్ పాయా సూప్ చాలా మంచి ఎంపిక. శాకాహారులు అయితే మష్రూమ్, క్యారెట్ లేదా బీట్‌రూట్ సూప్‌లు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ హెల్తీ మటన్ పాయా సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మటన్ పాయా సూప్ తయారు చేయడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక.. అందులో బిరియాని ఆకులు, ఏలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు మేక కాళ్ల ముక్కలు వేసి నెమ్మదిగా వేయించి రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, అవసరమైనంత నీరు వేసి బాగా కలపాలి. చివరగా కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
సూప్ ఉడికిన తర్వాత దానిని ఒక జల్లెడతో వడగట్టి వేరు చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే పుల్లని రుచితో సూప్ మరింత కమ్మగా ఉంటుంది. ఈ సూప్ కేవలం రుచిగానే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సహజంగా ఉండే కొల్లాజెన్ అనే పోషకం పేగు గోడలను బలంగా చేస్తుంది. అంతేకాకుండా ఈ సూప్ తాగడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలలో ఉపశమనం లభిస్తుంది.
మటన్ పాయా సూప్ శరీరానికి శక్తినిచ్చి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి కడుపులోని మలినాలను శుభ్రం చేస్తుంది. వేడి వేడిగా ఈ సూప్ తాగితే దాని ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈ సులభమైన తయారీ పద్ధతితో ఇంట్లోనే ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన పాయా సూప్‌ను ఆస్వాదించవచ్చు.