Health News: అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీని వల్ల బరువు పెరగడమే కాకుండా శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతున్నాయి. అందుకే ఆరోగ్య నిపుణులు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. నేటి కాలంలో బరువు పెరగడం అనేది చాలా మందికి ప్రధాన సమస్య. దీనిని తగ్గించాలంటే శారీరక శ్రమతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, డిటాక్స్ పానీయాలు అవసరం. ఇవి బరువుని తగ్గించడమే కాకుండా శరీరంలోని విషాలను బయటికి పంపిస్తాయి. అలాంటి డిటాక్స్ జ్యూస్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
దాల్చినచెక్క-తేనె డిటాక్స్ డ్రింక్
అనేక అధ్యయనాల ప్రకారం.. దాల్చిన చెక్క, తేనెతో తయారు చేసిన పానీయం మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాల్చిన చెక్కలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. మరోవైపు, తేనెను యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా పరిగణిస్తారు. దాల్చిన చెక్క, తేనెతో చేసిన పానీయాన్ని మీరు రోజు తీసుకోవచ్చు. ఈ పానీయం గుండె జబ్బులు, బరువు తగ్గడం, చర్మ ఇన్ఫెక్షన్లు, శరీరం వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.
దోసకాయ, పుదీనా డిటాక్స్ డ్రింక్
దోసకాయ, పుదీనాతో చేసిన పానీయం శరీరానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. దోసకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో తోడ్పడుతుంది. ఈ పానీయం చేయడానికి కొన్ని దోసకాయ ముక్కలు, సన్నగా తరిగిన పుదీనా ఆకులను నీటిలో కలపండి. రోజూ ఈ డిటాక్స్ వాటర్ తాగండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పానీయం బరువు తగ్గడానికి, రక్తపోటును తగ్గించడానికి, శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.
నిమ్మకాయ-అల్లం డిటాక్స్ డ్రింక్
నిమ్మకాయ, అల్లం పానీయం శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ డిటాక్స్ డ్రింక్ తయారు చేయడానికి మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ, 2 అంగుళాల తురిమిన అల్లం రసం కలపాలి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.