Fruit Prices: నవరాత్రి కారణంగా పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొనుగోలుదారులతో ఫ్రూట్స్ మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎందుకంటే నవరాత్రుల్లో అధిక సంఖ్యలో ప్రజలు ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో వీరు పండ్లు తప్ప మరేమి తినరు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో పండ్ల రేటు విపరీతంగా పెరిగింది. స్థానిక పండ్లతో పాటు విదేశీ పండ్లు కూడా మార్కెట్లలో వేగంగా అమ్ముడవుతున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వినియోగదారల జేబులు ఖాళీ అవుతున్నాయి.
నవరాత్రి సమయంలో అమ్మవారి భక్తులు ముఖ్యంగా మహిళలు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. కొంతమంది మహిళలు ఒక పూట భోజనం, మరో పూట పండ్లు తింటారు. కాబట్టి సహజంగానే నవరాత్రి సమయంలో పండ్లకు డిమాండ్ పెరిగింది. వినాయకచవితి నుంచి పండ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతేకాదు పండ్లతో పాటు పూలకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఎందుకంటే పండుగ వేళ పూలు అందరికి కావాల్సి ఉంటుంది. అంతేకాదు తెలంగాణలో అతిపెద్ద పూల పండుగ బతుకమ్మ. దీంతో సహజంగానే పండ్లకు ధర పెరిగింది.
పండ్ల ధర ఎంత పెరిగింది?
నవరాత్రి ఉపవాసంలో ఖర్జూరాలు ఎక్కువగా తింటారు. ప్రస్తుతం ఖర్జూరాలు ధర కిలో రూ .80 నుంచి రూ .270 మధ్య ఉంది. నాణ్యమైన అరటిపండ్లు డజనుకు దాదాపు రూ .40 నుంచి రూ .60 వరకు ఉంది. ఆపిల్ ధర 100 నుంచి 150 రూపాయలు. ఆరెంజ్ 150 నుంచి 200 వరకు, దానిమ్మ 60 నుంచి 100 వరకు, జామ 60 నుంచి100 వరకు పలుకుతున్నాయి. పండ్లలో కివీ, యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, సంత్రాలు, బత్తాయిలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా, పుచ్చ, కర్బుజా, సపోట, బొప్పాయి, అరటి పండ్లను ఉమ్మడి జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తారు.