Drumstick leaves Benefits: మునగాకుతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!

|

Jan 22, 2025 | 7:40 PM

మునగాకు తినడం వల్ల మహిళలకు ఆరోగ్యకరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మునగాకులో ఐరన్‌, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉండటంతో ఇది రక్తహీనతను తగ్గించడంలో, ఎముకల బలాన్ని పెంచడంలో, మెనోపాజ్ సమస్యలకు సహాయపడుతుంది. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనానికి మునగాకు చాలా మంచిది.

Drumstick leaves Benefits: మునగాకుతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!
Drum Stick Leaves
Follow us on

మన రోజువారీ ఆకుకూరలో మునగాకు అనేది ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. తల్లిపాలు పెంచడం నుంచి నెలసరి నొప్పులను తగ్గించడం వరకు ఈ ఆకు కూర మహిళల ఆరోగ్యానికి ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే రక్తహీనత, ప్రోటీన్ లోపం వంటి సమస్యల కోసం మునగాకు కూరను తీసుకోవడం చాలా మంచిది. మునగాకులో ఐరన్, ఇతర పోషకాలతో కూడి ఉండటం వల్ల గర్భిణీ మహిళల అవసరాలను తీర్చడంలో ఇది సహాయపడుతుంది. అలాగే రక్తంలో ఎర్రరక్త కణాలను పెంచడం, రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. నెలసరి నొప్పి ఉన్న సమయంలో మునగాకును పొడి రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

40 ఏళ్ల పైబడిన మహిళలు వారంలో కనీసం ఒకసారైనా మునగాకుతో చేసిన వంటకాలను తినడం చాలా అవసరం. ఇది ఎముకల బలానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. PCOS సమస్య ఉన్న మహిళలకు మునగాకులో ఉండే పోషకాలు, ఐరన్, మాగ్నీషియం వంటివి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడతాయి. మెనోపాజ్ సమయంలో మహిళలకు కాల్షియం అవసరం చాలా ఉంటుంది. ఇది మునగాకులో అధికంగా ఉంటుంది. మీకు ఇది విన్న వెంటనే ఏదైనా చేసుకోవాలని అనిపిస్తుందా.. మీకోసం మునగాకుతో రుచికరమైన పచ్చడిని తీసుకొచ్చా. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చడికి కావాల్సిన పదార్థాలు

  • మునగాకులు – 2 కప్పులు
  • చింతపండు – సరిపడా
  • ధనియాలు – 1 1/2 టీస్పూన్
  • మెంతులు – 1 టీస్పూన్
  • జీలకర్ర – 1 1/2 టీస్పూన్
  • ఆవాలు – 1 టీస్పూన్
  • ఎండుమిర్చి – 7
  • నూనె – కావలసినంత
  • ఉప్పు – రుచికి సరిపడా

తాలింపు కోసం కావాల్సినవి

ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి – 2, కరివేపాకు, నూనె – కావలసినంత

తయారీ విధానం

ముందుగా మునగాకును రిల్లేసి మంచిగా నీటితో శుభ్రం చేసి పక్కకు పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్‌లో ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వాసన వచ్చే వరకు దోరగా వేయించండి. ఇలా చేసి అవి పక్కకు పెట్టండి. అవి చల్లారక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి వేసి వేయించండి. కొంచం వేగాక మునగాకు వేసి వేయించండి. అందులో రుచికి సరిపడా చింతపండు వేసుకోని కలపండి. అలా వేగాక ఈ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. రోటీ పచ్చడి చేసే వాళ్లు రోటీలో రుబ్బండి ఇంకా రుచిగా ఉంటుంది. దీంట్లో చేయడం రాని వాళ్లు మిక్సీలో వేసి రుబ్బండి. మరో పాన్‌లో నూనె వేడి చేసి తాలింపు పదార్థాలు వేసి తాలింపు చేయాలి. తాలింపులో రుబ్బిన మిశ్రమం వేసి తక్కువ మంటపై ఉడికిస్తూ కలపాలి. చివరిగా ఉప్పు, ముందుగా తయారుచేసిన మసాలా పొడి వేసి కలపండి. చుట్టూ నూనె విడిగా వచ్చే వరకు కలపండి. ఇప్పుడు ఆరోగ్యకరమైన, రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ. ఈ చలికాలంలో చల్లటి వాతావరణంలో వేడి వేడి అన్నం వేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి కానీ, నూనె కానీ వేసి కలిపి తినండి. ఆ రుచి మాటల్లో చెప్పలేం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)