
ఉప్పు లేని పప్పు రుచి ఉండదు అన్నది సామెత. మనిషి ఆహారంలో ఉప్పు అంతటి కీలకమైన పదార్థం. అయితే మనం మార్కెట్ నుండి తెచ్చే ఉప్పు ప్యాకెట్లపై ఎక్స్‌పైరీ డేట్ ఉండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు సముద్రం నుండి లభించే సహజసిద్ధమైన ఉప్పుకు గడువు తేదీ ఉంటుందా.? అది నిజంగానే చెడిపోతుందా? అనే సందేహాలు చాలా మందికి వస్తాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే స్వచ్ఛమైన ఉప్పు ఎప్పటికీ చెడిపోదు. ఉప్పుకు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను దరిచేరనివ్వని అద్భుతమైన గుణం ఉంది. ఇది తేమను గ్రహించి బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. అందుకే పచ్చళ్లు, మాంసం వంటివి పాడవకుండా ఉండటానికి పూర్వం నుండి ఉప్పును ఒక సహజ నిల్వ కారకంగా వాడుతున్నారు.
ఉప్పు చెడిపోనప్పుడు ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు ఇస్తారనే సందేహం రావచ్చు. దానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
అయోడిన్ ఆవిరైపోవడం: మనం వాడే పొడి ఉప్పులో థైరాయిడ్ సమస్యలు రాకుండా అయోడిన్ కలుపుతారు. ఉప్పు అలాగే ఉన్నప్పటికీ, కాలక్రమేణా అందులో ఉండే అయోడిన్ గాలిలో కలిసి ఆవిరైపోతుంది. దీనివల్ల ఉప్పులో ఉండాల్సిన పోషక విలువలు తగ్గుతాయి. అందుకే నిర్ణీత కాలం లోపు వాడాలని గడువు తేదీ ఇస్తారు.
యాంటీ-కేకింగ్ ఏజెంట్లు: గాలిలోని తేమ వల్ల ఉప్పు గడ్డకట్టి రాళ్లలా మారకుండా ఉండటానికి కంపెనీలు అందులో యాంటీ-కేకింగ్ ఏజెంట్లు కలుపుతాయి. ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఈ ఏజెంట్లు పని చేయడం మానేస్తాయి. అప్పుడు ఉప్పు గట్టిగా మారుతుంది.
గడువు తేదీ దాటిన తర్వాత కూడా ఉప్పును ఉపయోగించవచ్చు. ఇది విషపూరితంగా మారదు. అయితే అందులో అయోడిన్ శాతం తగ్గిపోవడం వల్ల మన శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు. అలాగే ఉప్పు గడ్డలు కట్టడం వల్ల వాడటానికి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు.
ఉప్పు పాడవ్వదు కానీ అందులోని గుణాలు తగ్గుతాయి. కాబట్టి ఉప్పును గాలి చొరబడని సీసాల్లో నిల్వ చేసుకోవడం ద్వారా ఎక్కువ కాలం తాజాగా ఉండేలా చూసుకోవచ్చు.