
ఆధునిక ప్రపంచం.. ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు.. ఆరోగ్యానికి హాని చేసే వాటిని తినడంతోపాటు.. పేలవమైన జీవనశైలిని అవలంభిస్తున్నారు.. దీంతో తరతరాలుగా పాటిస్తున్న అనేక ఆరోగ్యకరమైన అలవాట్లు ఆధునిక జీవనశైలిలో మరుగున పడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి రాత్రి మిగిలిపోయిన అన్నంతో తయారుచేసే చద్దన్నం. ఒకప్పుడు సాధారణమైన ఈ ఆహారం పాశ్చాత్య పోకడల కారణంగా ప్రాధాన్యతను కోల్పోయింది. అయితే, దీని విలువను అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ వంటి సంస్థలు సైతం గుర్తించడం విశేషం. రాత్రికి తినడానికి వండుకున్న అన్నం తినగా మిగిలిన దానిలో మజ్జిగ లేదా పెరుగు కలిపి నానబెడతారు. కొన్ని సార్లు పాలు పోసి డైరెక్టుగా తోడు వేస్తారు.. దీనిని ఉదయాన్నే తినేందుకు ఉపయోగిస్తారు. ఈ విధంగా రాత్రంతా నానబెట్టిన అన్నంను చద్దన్నం అంటారు. వండుకున్న అన్నం తినగా మిగిలిపోయిన అన్నం అయిదారు గంటల్లో చల్లబడి బ్యాక్టీరియా చేరి చద్ది అన్నం అవుతుందని.. దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
చద్దన్నం కేవలం ఒక సాధారణ ఆహారం కాదు.. పోషకాల గని. రాత్రి వండిన అన్నాన్ని నీటిలో నానబెట్టి ఉదయం మజ్జిగ లేదా పెరుగుతో కలిపి తినే ఈ పద్ధతి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఉదయం అల్పాహారానికి బదులుగా చద్దన్నం తీసుకోవడం వల్ల పొట్ట తేలికగా ఉండడమే కాదు.. రోజంతా శక్తివంతంగా పనిచేయగలుగుతారు. దీనికి కారణం చద్దన్నంలో ఉండే లాక్టిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం వంటి విలువైన పోషకాలు.
సాధారణంగా వేడి అన్నంలో కన్నా చద్దన్నంలో 60% క్యాలరీలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక. అంతేకాకుండా, ఈ ఫర్మెంటెడ్ రైస్‌లో బి6, బి12 విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి అత్యవసరం. చద్దన్నంలో వృద్ధి చెందే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను నివారించడంలో ఇది సహాయపడుతుంది.
చద్దన్నం తినడం వల్ల ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇది శరీరంలో వేడిని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రతిరోజు చద్దన్నం తినేవారిలో రక్తపోటు అదుపులో ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలర్జీ వంటి లక్షణాలను దూరం చేయడమే కాకుండా, అల్సర్ సమస్య నివారణకు కూడా చద్దన్నం తోడ్పడుతుంది.
చద్దన్నం తయారీ కూడా చాలా సులభం. రాత్రి మిగిలిన అన్నంలో పాలు పోసి, రెండు మజ్జిగ చుక్కలు వేస్తే ఉదయానికి చద్దన్నం సిద్ధమవుతుంది. అంతేకాకుండా.. మజ్జిగ లేదా.. పెరుగు కలిపవచ్చు.. దీనికి ఉల్లిపాయ లేదా పచ్చిమిరపకాయ కలిపి తినేవారు మన పూర్వీకులు. వారు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించడానికి ఈ అలవాట్లు కూడా ఒక కారణం.. ఆధునిక సమాజంలో జంక్ ఫుడ్‌లకు అలవాటుపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న మనం.. మన పూర్వీకుల ఆరోగ్యకరమైన అలవాట్లను తిరిగి అలవర్చుకోవడం ద్వారా ఉత్తమ ఆరోగ్యాన్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. చద్దన్నం సంస్కృతి మనదే అయినా, దాని ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజు నుంచే చద్దన్నాన్ని దైనందిన ఆహారంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..