మష్రూమ్ బిర్యానీ.. మనకు త్వరగా తయారయ్యే రుచికరమైన వంటకం. సాధారణ బిర్యానీలతో పోలిస్తే ఇది తక్కువ సమయంలో తయారవుతుంది. మసాలా రుచిని ఎక్కువగా కోరేవారు కొంచెం అదనంగా మసాలాలు వేసుకోవచ్చు. ఇంట్లో ఈ బిర్యానీని ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బాస్మతి బియ్యాన్ని 20 నిమిషాలు నానబెట్టి నీటిని పూర్తిగా వడకట్టాలి. మష్రూమ్‌లను శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి. ఆపై తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చి వాసన పోయే వరకు వేపాలి. టమాటాలను కూడా అందులో వేసి మెత్తగా మారే వరకు ఉడికించాలి.
ఇప్పుడు మిర్చి పొడి, గరం మసాలా పొడి వేసి మసాలాలు బాగా కలిసేలా కలపాలి. ఆ తరువాత మష్రూమ్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసి కొన్ని నిమిషాలు వేగించాలి. తర్వాత బియ్యం వేసి తగినంత ఉప్పు నీరు పోసి మూత పెట్టి 20 నిమిషాలు ఉంచాలి. అద్భుతమైన రుచితో మష్రూమ్ బిర్యానీ సిద్ధం. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.