కాలీఫ్లవర్ కర్రీని ఇలా చేశారంటే.. అన్నం, చపాతీ ఏదైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

వంట మొదలుపెట్టే ముందు కాలీఫ్లవర్‌ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కాలీఫ్లవర్ ముక్కలను గోరువెచ్చని నీటిలో ఉప్పు, పసుపు వేసి కడగడం వల్ల అందులో ఉండే క్రిములు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాకుండా.. ఆ వివరాలు..

కాలీఫ్లవర్ కర్రీని ఇలా చేశారంటే.. అన్నం, చపాతీ ఏదైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
Gobi Curry

Updated on: May 10, 2026 | 12:52 PM

మన ఇంట్లో వండుకునే కూరగాయల్లో కాలీఫ్లవర్ చాలా ప్రత్యేకం. సాధారణంగా చేసే కాలీఫ్లవర్ వేపుడు కంటే, కొంచెం మసాలా దట్టించి గ్రేవీలా చేస్తే దాని రుచే వేరు. అది వేడివేడి అన్నం అయినా, మెత్తని చపాతీ లేదా రోటీ అయినా దేనిలోకైనా అద్భుతంగా సెట్ అయిపోతుంది. వంటరాని వారు కూడా ఎంతో సులభంగా, ఎంతో రుచిగా ఈ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

తయారీ విధానం:

ముందుగా కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, వేడి నీళ్లలో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల దానిలో ఉండే చిన్న పురుగులు, దుమ్ము శుభ్రం అవుతాయి. ఆ తర్వాత ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.

స్పెషల్ మసాలా పొడి:

ఈ కూరకు అసలైన రుచిని ఇచ్చేది మనం తయారు చేసుకునే తాజా మసాలా పొడి. బాణలిలో ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర, నువ్వులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. చివరగా కొంచెం కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేసి, చల్లారాక మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి.

గ్రేవీ కోసం:

అదే బాణలిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించాలి. ఇందులో కొంచెం చింతపండు, బెల్లం ముక్క వేస్తే రుచి మరింత పెరుగుతుంది. ఈ మిశ్రమం చల్లారాక మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

వండే పద్ధతి:

మరో బాణలిలో నూనె వేసి కాలీఫ్లవర్ ముక్కలను 80 శాతం వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. అదే నూనెలో జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేసి, ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ-టమాటా పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు, మనం తయారు చేసుకున్న మసాలా పొడి వేసి కలపాలి. ఇప్పుడు వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. కూర దగ్గర పడ్డాక కొంచెం పెరుగు కలిపితే రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ తయారవుతుంది. చివరగా కొత్తిమీర చల్లుకుంటే ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ కర్రీ రెడీ! ఈ పద్ధతిలో కాలీఫ్లవర్ కర్రీ చేస్తే ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.

Follow Us