AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు తెలుసుకోండి..

వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి అన్నం ఒక శత్రువులా మారిపోయింది. ముఖ్యంగా రాత్రిపూట రైస్ తింటే లావు అయిపోతామనే భయంతో చపాతీలు, ప్రత్యామ్నాయాల వైపు పరుగెడుతున్నారు. కానీ రాత్రిపూట అన్నం తింటే బరువు పెరుగుతారనేది ఒక పెద్ద అపోహ మాత్రమే అని దేశంలోనే టాప్ న్యూట్రిషనిస్టులు చెబుతున్నారని మీకు తెలుసా? రాత్రిపూట రైస్ తింటూనే బరువు ఎలా తగ్గొచ్చో తెలుసుకుందాం..

రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు తెలుసుకోండి..
How To Eat Rice At Night Without Gaining Weight
Krishna S
|

Updated on: Jul 25, 2026 | 8:41 PM

Share

బరువు తగ్గాలని ఆలోచించగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే ఆలోచన అన్నం తినడం మానేయాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో రైస్ తింటే బరువు పెరిగిపోతామనే భయంతో, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ప్రత్యామ్నాయాల వైపు చూస్తుంటారు. అయితే ఆహార పదార్థాల విషయంలో మంచివి – చెడ్డవి అనే వర్గీకరణల వల్ల ఏది సరైనదో తేల్చుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రాత్రిపూట అన్నం తినడం బరువు తగ్గే క్రమానికి నిజంగానే అడ్డంకా? దీనిపై ప్రముఖ పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

రాత్రివేళల్లో అన్నం తింటే నిజంగా బరువు పెరుగుతారా?

ప్రముఖ పోషకాహార నిపుణురాలు రూపాలి దత్తా ప్రకారం.. రాత్రివేళ అన్నం తినడం వల్ల మాత్రమే ఎవరూ బరువు పెరగరు. శరీరం పెరిగే లేదా తగ్గే విధానం మనం రోజంతా తీసుకునే మొత్తం క్యాలరీలు, కరిగించే క్యాలరీలపై ఆధారపడి ఉంటుంది తప్ప, కేవలం ఒక ఆహారంపై కాదు. మనం కరిగించే క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నంత కాలం, రాత్రి భోజనంలో అన్నం తిన్నా బరువు పెరిగే అవకాశమే లేదు. కాబట్టి రాత్రి అన్నం తింటే లావు అవుతారు అనేది పూర్తిగా ఒక అపోహ మాత్రమే అని ఆమె స్పష్టం చేస్తున్నారు.

టైమింగ్స్ కాదు.. మోతాదే కీలకం

రాత్రిపూట అన్నం తినడాన్ని నిషేధించాల్సిన అవసరం లేకపోయినా, పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలని రూపాలి దత్తా సూచిస్తున్నారు. పూటకు అర కప్పు నుండి ఒక కప్పు వరకు ఉడికించిన అన్నం తీసుకోవడం మంచిది. కేవలం అన్నం మాత్రమే కాకుండా దానికి ప్రోటీన్ లభించే పప్పు, పనీర్ లేదా చికెన్‌తో పాటుగా కూరగాయలను జోడించాలి. దీనివల్ల భోజనం సంపూర్ణంగా, సమతుల్యంగా మారుతుంది.

రైస్ శత్రువు కానే కాదు: రుజుతా దివేకర్

రాత్రిపూట అన్నానికి దూరంగా ఉండాలనే భావనను ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ కూడా తోసిపుచ్చారు. బరువు తగ్గాలనుకునే వారు అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

ఎలాంటి రైస్ ఎంచుకోవాలి?: సింగిల్ పాలిష్ చేసిన లేదా చేతితో దంచిన రైస్‌ను ఎంచుకోవాలి.

సమయం: రాత్రి భోజనానికి, పడుకునే సమయానికి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండాలి.

ప్రాంతీయ ఆహారం: అందరికీ సరిపోయే ఒకే రకమైన బియ్యం అంటూ ఏదీ ఉండదని, తమ సొంత ప్రాంతంలో పండే బియ్యాన్ని ఎంచుకుని ఆస్వాదించాలని ఆమె సూచిస్తున్నారు.

రాత్రి వేళల్లో అన్నం మేలా? రోటీ మేలా?

చాలామంది బరువు తగ్గడానికి అన్నం మానేసి రాత్రిపూట రోటీల వైపు మళ్లుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమం అనే ప్రశ్నకు కవితా దేవగన్ స్పందిస్తూ.. అందరికీ ఒకే నియమం వర్తించదని తెలిపారు. మన శరీర జీర్ణవ్యవస్థ సౌకర్యం, వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి అన్నం లేదా రోటీలలో ఏదైనా ఎంచుకోవచ్చు. దేనిని ఎంచుకున్నా, మనం ఎంత తింటున్నాం, దాన్ని సమతుల్యంగా తీసుకుంటున్నామా లేదా అనేది మాత్రమే ముఖ్యమని ఆమె వెల్లడించారు.

నిపుణుల ప్రకారం.. రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు తగ్గే ప్రయాణానికి ఎలాంటి భంగం వాటిల్లదు. మీరు ఎంత మోతాదులో తింటున్నారు.. ఎలాంటి పోషకాహారంతో కలిపి తీసుకుంటున్నారు అనేదే అసలైన విషయం. కాబట్టి మీ భోజనం పట్ల అప్రమత్తంగా ఉంటూ, పరిమిత మోతాదులో రాత్రిపూట నిరభ్యంతరంగా అన్నాన్ని ఆస్వాదించవచ్చు.

Follow Us