Bitter Gourd: కాకర‌కాయ చిన్న ఉల్లిపాయల కూర.. ఇలా వండితే ఓ పట్టు పట్టాల్సిందే..

కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక అద్భుతమైన ఔషధం. అయితే, దానిలో ఉండే చేదు కారణంగా చాలామంది ఈ కూరను తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు దీని పేరు చెబితేనే పారిపోతారు. అలాంటి వారికి కూడా ఇష్టపడేలా, చేదు లేకుండా కాకరకాయ కూరను ఎలా తయారు చేయాలో ఈ రెసిపీలో తెలుసుకుందాం. ఈ పద్ధతిలో చేస్తే కాకరకాయ కూర రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Bitter Gourd: కాకర‌కాయ చిన్న ఉల్లిపాయల కూర.. ఇలా వండితే ఓ పట్టు పట్టాల్సిందే..
Bitter Gourd Kuzhambu Recipe

Updated on: Sep 24, 2025 | 8:28 PM

చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఇష్టపడని కూరగాయలలో కాకరకాయ ఒకటి. దానికి ప్రధాన కారణం దానిలోని చేదు గుణం. అయితే, కాకరకాయ చేదు తెలియకుండా, రుచిగా కూర చేయాలంటే ఈ రెసిపీని ఒకసారి ప్రయత్నించి చూడండి.

కావలసిన పదార్థాలు

కాకరకాయ – 1

నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు

మెంతులు – 1 టీస్పూన్

కరివేపాకు – కొద్దిగా

చిన్న ఉల్లిపాయలు – 100 గ్రాములు

చింతపండు – ఒక ఉసిరికాయంత

కొత్తిమీర – కొద్దిగా

ఉప్పు – తగినంత

కూరకు పేస్ట్\u200cకు కావలసినవి:

తురిమిన కొబ్బరి – 1/4 కప్పు

చిన్న ఉల్లిపాయలు – 20

టమాటాలు – 3

ధనియాల పొడి – 1 స్పూన్

కారం పొడి – 1/2 స్పూన్

తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కాక, ముక్కలుగా కోసుకున్న కాకరకాయలు వేసి బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

ఆ తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి, తురిమిన కొబ్బరి, చిన్న ఉల్లిపాయలు, ధనియాల పొడి, కారం పొడి వేసి వేయించుకోండి.

ఇవన్నీ బంగారు రంగులోకి వచ్చాక స్టవ్ ఆపి చల్లార్చండి. ఆ తర్వాత అదే కడాయిలో టమాటాలు వేసి వేయించి చల్లార్చండి.

వేయించిన పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోండి. దీంతో కూరకు కావలసిన పేస్ట్ సిద్ధం అవుతుంది.

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, నువ్వుల నూనె వేసి, నూనె కాగిన తర్వాత మెంతులు వేసి వేయించండి. అవి బంగారు రంగులోకి వచ్చాక కరివేపాకు వేయండి.

ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోండి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించుకోండి.

ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి, అందులో చింతపండు పులుసు కలపండి.

ఆ తర్వాత తగినంత నీరు, ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించండి. కూర చిక్కబడిన తర్వాత, చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపివేయండి. అంతే, రుచికరమైన కాకరకాయ కూర సిద్ధం.