
ఖర్జూరం.. ఇది కేవలం డ్రై ఫ్రూట్ మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన సూపర్ ఫుడ్..ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాన్ని మనం రోజూ తింటుంటాం. కానీ ఖర్జూరాలను సరైన సమయంలో తింటేనే వాటి పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందుతాయని మీకు తెలుసా? ఖర్జూరం తినడానికి అత్యుత్తమ టైమ్, వాటి వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.
ఉదయం పూట ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం అత్యంత ప్రయోజనకరం. ఇది శరీరానికి వెంటనే గ్లూకోజ్‌ను అందించి, రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే అధిక ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించి, ప్రేగులను శుభ్రపరుస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో ఇది బాగా సహాయపడుతుంది.
మీరు జిమ్‌కు లేదా వ్యాయామం చేయడానికి వెళ్లే ముందు 30-60 నిమిషాల ముందు 2-3 ఖర్జూరాలు తినండి. ఇవి శరీరానికి నెమ్మదిగా శక్తిని విడుదల చేసి, మీరు త్వరగా అలసిపోకుండా కాపాడతాయి.
సాయంత్రం వేళలో టీ, బిస్కెట్లకు బదులుగా ఖర్జూరం తినడం మంచిది. ఇది ఆకలిని నియంత్రించి, రాత్రి భోజనం వరకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.
ఖర్జూరాన్ని పాలలో మరిగించి తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఇది శారీరక బలహీనతను తొలగించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.