How to know if Mango is Naturally Ripe : వేసవి వచ్చిందంటే చాలు మామిడి సందడి మొదలవుతుంది.. ధనిక, పేద తేడా లేకుండా అందరు తినే పండ్లు మామిడి. నగరంలో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తూ ఉంటాయి. అయితే పసుపు రంగులో కనిపించే సరికి అందరికి నోరూరుతుంది. కానీ అవే ఇప్పుడు అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఎందుకంటే వాటిని కృత్రిమంగా పండిస్తున్నారు. అందుకే మామిడి పండ్లను కొనేటప్పడు అవి ఎలా పండించారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కసారి ఆ విషయాలపై ఓ లుక్కేద్దాం. సాధారణంగా పండ్లన్నీ వాటిలో జరిగే రసాయనిక చర్యల కారణంగానే మగ్గుతాయి. అవి పండటానికి దోహదం చేసేది ఇథిలీన్. కాయలు పక్వానికి వచ్చిన తర్వాత వాటిలో సహజంగా ఉండే ఈ రసాయనం వల్ల అవి వాటంతట అవే పండుతాయి. కానీ వ్యాపారులు మాత్రం అవి తొందరగా పక్వానికి రావడానికి రసాయనాలు వాడుతారు. అవి బాగా పండినట్లుగా తయారవ్వడానికి క్యాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే మార్కెట్‌లో క్యాల్షియం కార్బైడ్ ఉపయోగించిన వాటితో పాటు సహజసిద్ధంగా పండించినవీ అమ్ముతారు వాటిని ఈ విధంగా గుర్తించాలి.
1. రంగుని బట్టి..
కృత్రిమంగా పండిన వాటిని గుర్తించడానికి పరిశీలించాల్సిన అంశాల్లో మొదటిది మామిడి పండు రంగు. మగ్గబెట్టిన మామిడిపండ్లు చూడటానికి పసుపు రంగులోనే ఉన్నా.. వాటిపై ఆకుపచ్చని రంగులో మచ్చలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. సహజసిద్ధంగా పక్వానికి వచ్చిన పండైతే దాని రంగు అంతా ఒకే విధంగా ఉంటుంది.
2.వాసన ఆధారంగా..
సాధారణంగా సహజమైన రీతిలో పండిన మామిడి నుంచి వచ్చే వాసన మధురంగా అనిపిస్తుంది. కానీ కార్బైడ్ ఉపయోగించి పండబెట్టిన మామిడపండ్ల నుంచి ఘాటైన వాసన వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాటి నుంచి ఎలాంటి వాసన రాకపోవడం కూడా మనం గమనించవచ్చు.
3. రుచి కూడా చెబుతుంది..
సాధారణంగా కృత్రిమంగా మగ్గబెట్టిన పండును తింటున్నప్పుడు నోటిలో, గొంతులో మంట పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటివి తిన్న కొంత సమయం తర్వాత కొందరిలో కడుపునొప్పి, డయేరియా వంటివి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదే సహజసిద్ధమైనది అయితే.. ఇలాంటి లక్షణాలేవీ కనిపించవు. పైగా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
4.గుజ్జునూ పరిశీలించాల్సిందే..
సహజసిద్ధమైన రీతిలో పండిన మామిడి పండ్ల గుజ్జు కాస్త ఎరుపు కలిసిన పసుపు రంగులో ఉంటుంది. పైగా గుజ్జంతా ఒకే విధంగా కనిపిస్తుంది. అదే కృత్రిమంగా మగ్గిన పండైతే.. గుజ్జు లేత లేదా ముదురు పసుపు రంగులో ఉంటుంది. ఇది పండు పూర్తిగా తయారవ్వలేదనడానికి నిదర్శనం.
5.రసం ఎక్కువా? తక్కువా?
మీరు మామిడి జ్యూస్ తీస్తున్నప్పుడు రసం చాలా తక్కువ మోతాదులో వచ్చిందా? అయితే అది కృత్రిమంగా మగ్గబెట్టిన పండే. పూర్తిగా పక్వానికి వచ్చి సహజసిద్ధమైన రీతిలో మగ్గిన మామిడి పండులో రసం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా తియ్యగా కూడా ఉంటుంది.