
చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ లేదా స్ట్రాంగ్ కాఫీ తాగనిదే రోజు గడవదు. ఆ కప్పు కెఫిన్ పడకపోతే పనిలో వేగం రాదని భావిస్తారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం నిద్రలేవగానే శరీరంలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో కెఫిన్ తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది.
ఉదయం పరగడుపున టీ, కాఫీలు తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కెఫిన్ కడుపులోని లైనింగ్‌ను ఇబ్బంది పెట్టి అజీర్ణానికి దారితీస్తుంది. అందుకే ఉదయం లేవగానే ఏదైనా చిన్నపాటి ఆహారం తీసుకున్న తర్వాతే టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యకరం.
గ్రీన్ టీ బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి మంచిదని అందరూ భావిస్తారు. కానీ అది తాగే సమయం చాలా ముఖ్యం. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే అందులోని టానిన్లు కడుపులో చికాకును కలిగిస్తాయి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. రోజుకు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీ సరిపోతుంది. అతిగా తాగడం వల్ల నిద్రలేమి, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు రావచ్చు. రాత్రి పడుకోవడానికి మూడు గంటల ముందే దీన్ని ముగించాలి.
బ్లాక్ టీ, గ్రీన్ టీలలో ఉండే పాలీఫెనాల్స్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. రెగ్యులర్‌గా బ్లాక్ టీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.
ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ఎముకలను దృఢపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణనిస్తాయి.
మీరు ఏ రకమైన టీ తాగినా, అది మితంగా, సరైన సమయంలో తీసుకుంటేనే మందులా పనిచేస్తుంది. అతిగా తాగితే అమృతమైనా విషమే అన్నట్లుగా.. మీ టీ అలవాట్లను మార్చుకుని రోజంతా ఉత్సాహంగా ఉండండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..