
క్యారెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. వారానికి కనీసం రెండుసార్లు క్యారెట్లు తినడం వల్ల తీవ్రమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యారెట్లను సలాడ్ల నుంచి జ్యూస్‌ల వరకు అనేక విధాలుగా తినవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో క్యారెట్లు తాజా కూరగాయలు, పండ్లతో పాటు తక్కువ ధరకే లభిస్తాయి. కాబట్టి ఈ కాలంలో తాజా క్యారెట్లను తినడం చాలా సులువు. ఇవి తినడానికి రుచికరంగా కూడా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
కొంతమంది తాజా క్యారెట్లను పచ్చిగా తింటారు. మరికొందరు వాటిని వివిధ వంటలలో తయారు చేసి తింటారు. ప్రత్యేకత ఏమిటంటే మీరు ఈ క్యారెట్లను ఎలా తిన్నా, అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇటీవలి అధ్యయనం ప్రకారం.. వారానికి 2 నుండి 4 పచ్చి క్యారెట్లు తినడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని దాదాపు 17 శాతం తగ్గించవచ్చట. కొలొరెక్టల్ క్యాన్సర్ అనేది పెద్దప్రేగు లేదా పురీషనాళంలో ప్రారంభమయ్యే క్యాన్సర్. ఇది సాధారణంగా పాలిప్స్ అని పిలువబడే పెరుగుదలల వల్ల సంభవిస్తుంది.
క్యారెట్లలో కెరోటినాయిడ్లు, లుటిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. వీటిని వారానికి కనీసం రెండుసార్లు తీసుకోవడం పాలిప్స్ పేగుల్లో ఏర్పడకుండా నిరోధిస్తుంది. క్యారెట్లు శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వాటి శోథ నిరోధక లక్షణాల కారణంగా అవి రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. విటమిన్ కె, విటమిన్ బి6 వంటి ఇతర పోషకాలకు మంచి మూలం. వీటిలోని బీటా-కెరోటిన్ రేచీకటి, కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అయితే క్యారెట్లతో తయారు చేసిన స్వీట్లు లేదా ఇతర ఆహారాలను తినడం కంటే పచ్చి క్యారెట్లు తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా వీటిని ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.