
ఈ రోజుల్లో నగరాల్లో వాయు కాలుష్యం, దట్టమైన పొగమంచు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో గాలిలోని ప్రమాదకరమైన PM2.5 కణాల నుండి ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి చాలా మంది రోజూ ఉదయాన్నే ఒక ముక్క బెల్లం తింటున్నారు. బెల్లం తింటే లంగ్స్ క్లీన్ అయిపోతాయంటూ వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వస్తున్న వెల్‌నెస్ టిప్స్‌ను చూసి జనం దీనిని ఒక మెడిసిన్‌లా ఫాలో అయిపోతున్నారు. కానీ ఆధునిక వైద్యశాస్త్రం దీనిని అంగీకరిస్తుందా? బెల్లం నిజంగానే ఊపిరితిత్తులను డెటాక్స్ చేస్తుందా? అమృత హాస్పిటల్ హెడ్ ఆఫ్ పల్మనాలజీ, ప్రముఖ పల్మనాలజిస్ట్ అర్జున్ ఖన్నా దీనికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
బెల్లం ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుందనే నమ్మకం 1994లో బొగ్గు ధూళికి గురైన ఎలుకలపై జరిగిన ఒక పాతకాలపు అధ్యయనం ఆధారంగా వచ్చింది. అప్పట్లో ఎలుకలపై అది కొంతవరకు పనిచేసినట్లు చూపించినా.. నేటి ఆధునిక సైన్స్‌లో మనుషులపై చేసిన పరిశోధనలు ఎక్కడా లేవు. ‘‘బెల్లం మనుషుల ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుందని లేదా సిటీల్లో పెరిగిపోతున్న ఘోరమైన PM2.5 కాలుష్యం నుండి మిమ్మల్ని కాపాడుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది కేవలం వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమే తప్ప ఆధునిక సైన్స్ నిరూపించినది కాదు’’ అని డాక్టర్ అర్జున్ ఖన్నా స్పష్టం చేశారు.
కాలుష్యం నుండి ఉపశమనం కోసం రోజుకు 10 నుండి 20 గ్రాముల బెల్లం తినాలని రీల్స్ చూసి డైట్ ప్లాన్ చేసుకుంటే మెటబాలిక్ హెల్త్ దెబ్బతినడం ఖాయం. ఎందుకంటే బెల్లం నుండి వచ్చే క్యాలరీలు కూడా సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ల నుండే వస్తాయి. షుగర్ లేదా ప్రీ డయాబెటిస్ ఉన్నవారు బెల్లం తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగి, ఆస్తమా లేదా స్లీప్ అప్నియా వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. కాగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు కేవలం 5 నుండి 10 గ్రాముల చిన్న బెల్లం ముక్కను ఒక స్వీట్‌లా తినవచ్చంతే.. అంతేగానీ దానిని పొల్యూషన్ షీల్డ్‌గా భావించి ఎక్కువగా తినకూడదు.
సోషల్ మీడియా ట్రెండ్స్‌ను పక్కన పెట్టి, మెడికల్ సైన్స్ ప్రకారం వాయు కాలుష్యం నుండి రక్షణ పొందడానికి ఇవి పాటించండి..
N95/FFP2 మాస్కులు: ఇవి గాలిలోని అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మ కణాలను లోపలికి పోకుండా వంద శాతం అడ్డుకుంటాయి.
ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్లు: ఇంట్లోని PM లెవెల్స్‌ను తగ్గించి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి క్లినికల్‌గా నిరూపించబడ్డాయి.
విటమిన్ C – E ఒమేగా-3: ఇవి కాలుష్యం వల్ల బాడీలో వచ్చే అంతర్గత వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.