
చల్లటి నీరు లేదా ఫ్రిజ్ నీరు తాగడం వల్ల జలుబు చేస్తుందనేది తరతరాలుగా మనం వింటూనే ఉన్నాం..వైద్యశాస్త్రం ప్రకారం, చల్లటి నీరు తాగడం వల్ల నేరుగా జలుబు రాదు. సాధారణ జలుబుకు లేదా ఫ్లూకి అసలైన కారణం రైనోవైరస్ వంటి సూక్ష్మజీవులు అంటే వైరస్‌లు. ఈ వైరస్‌లు గాలి ద్వారా తుమ్ములు, దగ్గు లేదా సోకిన వ్యక్తి తాకిన వస్తువులను తాకినప్పుడు మాత్రమే మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనం తాగే నీటి ఉష్ణోగ్రతకు, జలుబు ఇన్ఫెక్షన్ రావడానికి ఎటువంటి సంబంధం లేదు.
మనోళ్లకు ఈ అనుమానం రావడం వెనుక ఒక చిన్న కారణం ఉంది. మీకు ఇదివరకే గొంతులో స్వల్పంగా ఇన్ఫెక్షన్, అలర్జీ లేదా నొప్పి ఉంటే, అప్పుడు చల్లటి నీరు తాగినప్పుడు గొంతులోని రక్తనానాలు తాత్కాలికంగా సంకోచిస్తాయి. దీనివల్ల స్థానికంగా ఉన్న రోగనిరోధక శక్తి తాత్కాలికంగా తగ్గి గొంతు కిరికిరి లేదా అస్వస్థతగా అనిపించవచ్చు. అంటే, ఇది ఉన్న లక్షణాలను కొద్దిగా ఎక్కువ చేస్తుంది తప్ప, కొత్తగా జలుబును సృష్టించదు.
చల్లటి నీరు తాగడం వల్ల కాకుండా, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వైరస్‌లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. పైగా ప్రజలంతా ఇళ్లలోనే కలిసి సమయం గడపడం వల్ల ఒకరి నుండి ఒకరికి వైరస్ సులభంగా సోకుతుంది. దీన్ని చాలామంది చల్లటి నీటికి లింక్ చేస్తారు.. కానీ అసలు నేరస్థుడు వైరస్ మాత్రమే.
సబ్బుతో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.
జలుబు లేదా ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కొద్దిగా దూరంగా ఉండాలి.
రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి రోజూ సమతులాహారం, తగినంత నిద్ర అవసరం.
శరీరానికి తగినంత నీటిని తాగాలి. చల్లటి నీరు తాగడం వల్ల జలుబు చేస్తుందనేది ఒక వైద్యపరమైన అపోహ మాత్రమే. మీ ఆరోగ్యం బాగున్నంత వరకు చల్లటి నీరు తాగడంలో ఎలాంటి ప్రమాదం లేదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..