తిన్న వెంటనే ఈ ఒక్క పని చేస్తే చాలు.. షుగర్, గుండె ఆరోగ్యానికి శ్రీరామ రక్ష! డాక్టర్ చెప్పిన గోల్డెన్ టిప్స్‌..

మనం ఆరోగ్యంగా ఉండటానికి ఏం తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే విషయాలపై చూపే శ్రద్ధ.. తిన్న తర్వాత ఏం చేస్తున్నామనే దానిపై చూపించం. కానీ, భోజనం చేసిన తర్వాత గడిచే మొదటి 15 నిమిషాలు మన శరీర జీవక్రియను, రక్తంలో చక్కెర స్థాయిలను శాసించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ అభయ్ ఇందర్‌జీత్ అహ్లువాలియా తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ అకస్మాత్తుగా పెరగకుండా ఉండేందుకు ఆయన కొన్ని ముఖ్యమైన అలవాట్లను సూచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

తిన్న వెంటనే ఈ ఒక్క పని చేస్తే చాలు.. షుగర్, గుండె ఆరోగ్యానికి శ్రీరామ రక్ష! డాక్టర్ చెప్పిన గోల్డెన్ టిప్స్‌..
Post Meal Walk

Updated on: Jul 06, 2026 | 12:14 PM

భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకోవడానికి డాక్టర్ అభయ్ ఇందర్‌జీత్ అహ్లువాలియా ఒక సులువైన 15 నిమిషాల అలవాటును సూచించారు. సాధారణంగా తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని నియంత్రించడానికి భోజనం ముగిసిన వెంటనే ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం.. 15 నిమిషాల పోస్ట్-మీల్ దినచర్య ఏంటంటే…

పరుగెత్త కూడదు.. తేలికగా నడవండి :

భోజనం చేసిన వెంటనే 10 నుండి 15 నిమిషాల పాటు చాలా సాధారణంగా, తేలికపాటి నడక సాగించడం ఒక అద్భుతమైన అలవాటు. ఇలా చేయడం వల్ల శరీరంలోని అస్థిపంజర కండరాలు ఉత్తేజితమై రక్తంలోని అదనపు గ్లూకోజ్‌ను ఇంధనంగా వాడుకుంటాయి. ఫలితంగా, తిన్న తర్వాత వచ్చే షుగర్ స్పైక్ గణనీయంగా తగ్గుతుంది. అయితే, ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినమైన వ్యాయామాలు లేదా రన్నింగ్ చేయకూడదు. అలా చేస్తే రక్తం జీర్ణవ్యవస్థకు కాకుండా కండరాలకు మళ్లి, కడుపునొప్పి, వికారం కలిగే ప్రమాదం ఉంది.

తిన్న వెంటనే పడుకోవద్దు :

చాలా మందికి తిన్న వెంటనే మంచంపై వాలిపోయే అలవాటు ఉంటుంది. కానీ, ఇలా చేయడం వల్ల కడుపులోని ఆమ్లాలు పైకి తన్ని, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. భోజనం తర్వాత కనీసం 15 నిమిషాల పాటు నిటారుగా కూర్చోవడం లేదా నిలబడటం వల్ల గురుత్వాకర్షణ శక్తి సహాయంతో ఆహారం జీర్ణనాళంలోకి సులభంగా కదులుతుంది.

ఇవి కూడా చదవండి

ఒత్తిడికి దూరంగా ఉండండి :

భోజనం ముగించిన వెంటనే తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన పనులు చేయడం, స్క్రీన్ల ముందు గడపడం వంటివి చేయకూడదు. ఒత్తిడి హార్మోన్లు గ్లూకోజ్ నియంత్రణను దెబ్బతీస్తాయి. అలాగే, తిన్న వెంటనే అతిగా నీళ్లు తాగకుండా, జీర్ణక్రియకు ఇబ్బంది కలగని రీతిలో తగినంత మొత్తంలో మాత్రమే నీటిని తీసుకోవాలి.

రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత ఈ చిన్నపాటి నడకను, సరైన భంగిమను అలవాటు చేసుకోవడం వల్ల మధుమేహం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఊబకాయం ఉన్నవారికే కాకుండా సాధారణ వ్యక్తులకు కూడా దీర్ఘకాలంలో గుండె జబ్బులు, నరాల బలహీనత వంటి ముప్పులు తప్పి జీవక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ 15 నిమిషాల సూత్రం ఒక బలమైన పునాది!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us